సాక్షి, హైదరాబాద్: వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ఖజానాకు చిల్లుపెట్టిన బోధన్ వాణిజ్య పన్నుల స్కాంలో తిరిగి కదలిక మొదలైంది. ఈ కేసులో చార్జిషీటు దాఖలు చేసే విషయంలో సీఐడీ అధికారులు ముందడుగు వేసినట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ ఖజా నాకు గండికొట్టిన రూ.300 కోట్ల వాణిజ్య పన్నుల నకిలీ డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ సీఐడీ అధికారులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ స్కాంలో సూత్రధారి శివరాజు ఒక సంస్థ కోసం తీసిన చలానాను పలు సంస్థల పేరిట చూపించినట్లుగా రికార్డులు రాసి, సదరు మొత్తాన్ని జేబులో వేసుకున్నారు. ఫలితంగా వాణిజ్య శాఖకు తీవ్రనష్టం వాటిల్లిం ది. కేసు దర్యాప్తులో కీలకంగా ఉన్న పలు చలానాలు, అనుమానాస్పద పత్రాలు, డాక్యుమెంట్ల ఫిజికల్ వెరిఫికేషన్ మొదలైతే త్వరలోనే చార్జిషీటు సిద్ధమవుతుందని సమాచారం. ఈ వ్యవహా రంపై పలు ఫిర్యాదులు రావడంతో అప్రమత్తమైన ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.
విజిలెన్స్ విచారణలో ప్రధాన నిందితుడు శివరాజ్, అతని కుమారుడు, మరికొందరు అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించింది. 2010 నుంచి 2016 వరకు సాగిన వీరి అక్రమాల ఫలితంగా వాణిజ్య శాఖకు, ప్రభుత్వ ఖ జానాకు రూ.300 కోట్ల నష్టం వాటిల్లినట్లు నివేదిక సమర్పించిం ది. కేసు సీఐడీకి బదిలీ అయ్యాక తండ్రీకుమారులిద్దరూ అరెస్టయ్యారు. స్వాధీనమైన చలానాలు, కంప్యూటర్లు, హార్డ్‌డిస్కుల ను ఇప్పటికే సైబర్ నిపుణులు విశ్లేషించారు కూడా. చాలా కాలం తరువాత ఇప్పుడు అనుమానాస్పద పత్రాల ఫిజికల్ వెరిఫికేషన్ ప్రక్రియ మొదలైంది. వాస్తవానికి ఆలస్యంగా మొదలైనా.. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన శాస్త్రీయ ఆధారాలకు ఇది కీలకం కానుం ది. పత్రాల పరిశీలన పూర్తికాగానే చార్జిషీటు వేస్తారని సమాచారం. ఈ కేసులో తీవ్ర జాప్యం జరిగిందని సీఐడీపై విమర్శలు వస్తున్న క్రమంలో కేసులో కదలిక రావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment