చాప కింద నీరులా
విస్తరిస్తున్న మహమ్మారి
కేన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, ఆస్తమా వచ్చే అవకాశం
పాఠశాలలు, కాలేజీ యువతే లక్ష్యంగా విక్రయాలు
ఒక్కో ఈ–సిగరెట్
ఖరీదు రూ. 3 వేల నుంచి రూ. 30 వేలు
13 రాష్ట్రాల్లో నిషేధం... తెలంగాణలోనూ నిషేధించే అవకాశం
చూడడానికి స్టైలిష్‌గా ఉంటుంది... తాగితే మాంచి అనుభూతినిస్తుంది... సాధారణ సిగరెట్ కంటే ఆకర్షిస్తుంది. పైగా వివిధ రకాల పండ్ల సువాసన వెదజల్లుతుంది. అదే ఈ–సిగరెట్. ఇప్పుడు దేశంలోనూ, రాష్ట్రంలోనూ యువతీ యువకులు ముఖ్యంగా టీనేజర్లు దీనికి ఆకర్షితులవుతున్నారు. చివరకు అనారోగ్యాలకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే సదుపాయం ఉండటంతో టీనేజర్లు ఎగబడుతున్నారు. సాధారణ సిగరెట్టు మాదిరిగా పొగ బయటకు రాదు. కాబట్టి తాగే వారిని గుర్తించడమూ అంత సులువుకాదు. విచిత్రమేంటంటే దశాబ్ద కాలంగా టీనేజీ పిల్లల్లో సిగరెట్లు తాగడం గణనీయంగా తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఈ–సిగరెట్లు వచ్చి వారిని నాశనం చేస్తు న్నాయి. దాని వల్ల వచ్చే ప్రమాదాలు తెలియకపోవడంతో స్టైల్ కోసం తాగుతున్నారు. సాధారణ సిగరెట్లతో ఎంతటి దుష్ప్రభావాలున్నాయో, అంతకుమించి ఈ–సిగరెట్లతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డెంటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలు పేర్కొన్నాయి. ఈ మేరకు ఒక అధ్యయన పత్రాన్ని అవి తయారు చేశాయి. ఆ వివరాలతో కూడిన నివేదికను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖకు అందజేశాయి. ప్రపంచంలో ఈ–సిగరెట్లను 36 దేశాలు నిషేధించాయి. మన దేశంలో పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, పాండిచ్చేరి, జార్ఖండ్ రాష్ట్రాలు నిషేధిం చాయి. తెలంగాణలోనూ నిషేధించాలని వైద్య, ఆరోగ్యశాఖకు ఈ సంస్థలు ఇటీవల విన్నవించాయి. – సాక్షి, హైదరాబాద్
ఎలా పని
చేస్తుంది?
ఈ–సిగరెట్టు బ్యాటరీతో పనిచేస్తుంది. నికోటిన్‌తో ఉండే ద్రవ పదార్థాన్ని మండించడం ద్వారా ఇది పనిచేస్తుంది. ఉదాహరణకు దోమలను పారదోలేందుకు కొన్ని రకాల లిక్విడ్ మందును మనం ఎలా విద్యు త్‌తో వాడతామో అలాగే ఇది కూడా పనిచేస్తుంది. అందులో ద్రావణం మండి ఆవిరి కలుగ జేస్తుంది. తద్వారా అది ఒకరకమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ–సిగరెట్లకు అనేక పేర్లున్నాయి. ఈ–సిగ్స్, ఈ–హుక్కాస్, వేప్ పెన్స్, ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్స్ అని కూడా అంటారు. చూడడానికి ఇవి పెన్నుల మాదిరిగా కూడా ఉంటాయి. ఈ–సిగరెట్ల ఖరీదు ఏకంగా రూ. 3 వేల నుంచి రూ. 30 వేల వరకు మన దేశంలో విక్రయిస్తున్నారు. అయితే పెన్ను రీఫిల్ మార్చినట్లుగా అనేక సార్లు దీన్ని మార్చుకోవచ్చు. ఒకసారి రూ. 30 వేలు పెట్టి కొంటే, దాంట్లో ద్రవ పదార్థం అయిపోయినప్పుడల్లా రూ. 700 నుంచి రూ. వెయ్యి వరకు పెట్టి రీఫిల్ చేసుకోవచ్చు. అలా వంద నుంచి రెండొందలసార్ల వరకు మార్చుకునే వెసులు బాటుంది. ఇండియాలో దీనికి ఎంత మంది బానిసలయ్యారన్న దానిపై ఇంకా స్పష్టమైన డేటా లేదు. కానీ అమెరికాలో మూడు శాతం మంది పెద్దవాళ్లు ఈ–సిగరెట్లు తాగుతున్నారు. 15% మంది దాన్ని కొత్తగా ప్రయత్నించారని అధ్యయనాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లోనూ టీనేజర్లు దీని బారిన పడినట్లు ఆ సంస్థలు చెబుతున్నాయి.
కేన్సర్‌కు దారితీస్తుంది...
సాధారణ సిగరెట్లలో పొగాకును మండిస్తారు. దానిద్వారా కార్బన్ మోనాౖMð్సడ్ తదితర రసాయనాలు మన ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతాయి. ఈ–సిగరెట్ల ద్వారా అత్యంత ప్రమాదకరమైన బెంజిన్, ఇథైలిన్ ఆౖMð్సడ్, ఎక్రిలమైడ్ వంటి రసాయనాలు వెలువడతాయి. వాటిని పీల్చుతారు. అంతేగాక టాక్సిక్ మెటల్స్‌ను కూడా పీల్చుతారు. ఈ–సిగరెట్లలో ఉండే కాయిల్స్ ద్వారా ఇవి ఉత్పత్తి అవుతాయి. వీటిని పీల్చడం ద్వారా కేన్సర్, నాడీ మండల వ్యవస్థ ధ్వంసం కావడం తదితర దుష్పరిణామాలు తలెత్తుతాయి. అలాగే ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు సంభవిస్తాయి. హైబీపీ తలెత్తడం, ఒక్కోసారి కోమాలోకి వెళ్లి చనిపోవడం జరుగుతుంది. తక్కువ డోస్ ఈ–సిగరెట్లు తాగితే వాంతులు, కడుపునొప్పి తదితరాలు సంభవిస్తాయని వైద్య నిపుణులు అంటున్నారు.
ప్రమాదకరమైన అనారోగ్య సమస్యలు..
ఈ–సిగరెట్లలో నికోటిన్ అనే
పదార్థం ఉంటుంది. మెదడుపై అది ప్రభావం చూపుతుంది. గర్భిణీలు తాగితే మరింత ప్రమాదం. సాధారణ సిగరెట్లను మానేయడానికి ఈ–సిగరెట్లు ఉపయోగపడతాయన్న ప్రచారాన్ని కంపెనీలు ప్రచారం చేస్తున్నాయి. కానీ ఎక్కడా అలా జరగకపోగా, మరింతగా బానిసలవుతున్నారు. ఈ–సిగరెట్లలో ఉండే బ్యాటరీలు ఒక్కోసారి పేలి పిల్లలు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ–సిగరెట్లు తయారు చేసే ప్రధాన బ్రాండ్లు అన్నీ కూడా పొగాకు కంపెనీలే కావడం గమనార్హం.
టీనేజీ పిల్లలను ఈ–సిగరెట్లు ఆకర్షించడానికి ప్రధాన కారణం... వివిధ రకాల ప్లేవర్లలో (రుచులు లేదా సువాసన) అందుబాటులో ఉండటం, ఉన్నతమైన టెక్నాలజీతో తయారు కావడం, పైగా దీనివల్ల సాధారణ సిగరెట్ల కంటే ప్రమాదం తక్కువన్న ప్రచారం ఉండటం.
రాష్ట్రంలోనూ నిషేధించాలి
ఈ–సిగరెట్లను నిషేధించాలని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు ఇటీవల విన్నవించాం. దేశంలో వివిధ రాష్ట్రాలు నిషేధించాయని, తెలంగాణ లోనూ వీటిని నిషేధించేలా నిర్ణయం తీసుకోవాలని కోరాం. పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు.
– నాగ శిరీష, వాలంటరీ హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధి
Comments
Please login to add a commentAdd a comment