సాక్షి నెట్‌వర్క్: చంద్రగ్రహణం ప్రభావంతో శుక్రవారం ప్రముఖ పుణ్యక్షేత్రాలన్నీ మూతపడనున్నాయి. శుక్రవారం రాత్రి 11.54కి చంద్రగ్రహణం ప్రారంభమై శనివారం ఉదయం 3.49 వరకు ఉంటుంది. దీంతో తెలంగాణ, ఏపీలోని ప్రధాన అలయాలైన యాదాద్రి, భద్రాద్రి, తిరుమల, శ్రీశైలం తదితర ఆలయాలను మూసివేయనున్నారు.
తిరుమలలో...
చంద్రగ్రహణం కారణంగా శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి మరుసటిరోజు తెల్లవారుజామున 4.15 గంటల వరకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం మూతపడనుంది. శనివారం ఉదయం 4.15 గంటలకు సుప్రభాతంతో ఆలయం తలుపులు తెరిచి శుద్ధి చేసి పుణ్యహవచనం నిర్వహిస్తారు. ఉదయం 7 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది.
శుక్రవారం ఆర్జిత, పౌర్ణమి గరుడ సేవలు రద్దు చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అన్న ప్రసాదాన్ని నిలిపివేస్తామంది. చంద్రగ్రహణం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నుంచే భక్తులను క్యూలైన్, కంపార్టుమెంట్లలోకి అనుమతించరు.
యాదాద్రిలో..
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని బాలాలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మూసివేస్తున్నట్లు ఈఓ గీతారెడ్డి తెలిపారు. ఆలయంలో ఉదయం అభిషేకాలు, అర్చనలు, సుదర్శనహోమాలను నిలిపివేసినట్లు చెప్పారు. సంప్రోక్షణ అనంతరం శనివారం ఉదయం 5 గంటలకు ఆలయాన్ని తెరుస్తారని పేర్కొన్నారు.
భద్రాద్రిలో కూడా..
భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయాన్ని శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ ఏఈఓ శ్రావణ్‌కుమార్ తెలిపారు. శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు తెరిచి సంప్రోక్షణ, ఆలయశుద్ధి చేస్తామని చెప్పారు.
శ్రీశైలంలో..
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి శ్రీశైల మల్లన్న ఆలయ ప్రధాన రాజగోపుర ద్వారాలను మూసివేస్తున్నట్లు ఈవో శ్రీరామచంద్రమూర్తి తెలి పారు. గ్రహణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు జరిగే నిత్యకల్యాణం తాత్కాలికంగా నిలిపి వేస్తామన్నారు. శనివారం వేకువజామున 4.30కి ఆలయ ద్వారాలను తెరిచి.. ఆలయశుద్ధి, సంప్రోక్షణ, ప్రాతఃకాల పూజలు నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment