విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే నాగం జనార్దన్‌రెడ్డి
-బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్ధన్‌రెడ్డి
నాగర్ కర్నూల్ రూరల్: ప్రాజెక్టుల నిర్మాణంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అవగాహన లేదని, లోతుగా అధ్యయనం చేస్తే తప్ప వీటి నిర్మాణాలు పూర్తి చేయలేరని మహబూబ్ నగర్ జిల్లా నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే, బీజేపీ జాతీయ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. ఒకప్పుడు వర్షాలు పడితే వాగులు, వంకలు, చెరువులు కళకళలాడేవని, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటి వర్షం పడినా ఒకటి, రెండు రోజులకే భూమి తడారిపోయి చెరువుల్లో నీళ్లు లేకుండా పోతున్నాయని నాగం అన్నారు. ఈ ప్రాంతంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే అవి శ్రీరామరక్షగా ఉంటాయని, లిఫ్ట్ ఇరిగేషన్ కాలువల ద్వారా చెరువులు నింపుకుని పంటలు పండించుకునే వీలుంటుందని పేర్కొన్నారు. గురువారం ఆయన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కరువు లేదని వ్యాఖ్యానించటం రైతుకు నష్టం కలిగించే చర్యేనని అన్నారు. ప్రతిదానికీ తెలంగాణ సెంటిమెంట్ అంటూ అడ్డగోలు నిర్ణయాలు చేస్తున్నారని ఆరోపించారు.
లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఇప్పటికే 90శాతం పూర్తి కాగా కేవలం 10 శాతం పనులే మిగిలాయని, వాటిని పూర్తి చేయటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. మిషన్ కాకతీయ పేరుతో ప్రభుత్వం చేపడుతున్న పనులు అర్థరహితంగా ఉన్నాయని, కాకతీయకు, మిషన్‌కు సంబంధం ఏమిటని ప్రశ్నించారు. కనీస పరిజ్ఞానం లేని కాంట్రాక్టర్లకు టీఆర్‌ఎస్ కార్యకర్తలకు పనులు అప్పజెబుతూ ఒకనాటి పటిష్టమైన చెరువులను పాడు చేస్తున్నారని అన్నారు. బిజినేపల్లి మండలం పోలేపల్లి చెరువుకు ఉన్న రివిట్‌మెంట్‌ను పరిజ్ఞానం లేని కాంట్రాక్టర్ ను తీసివేసి చెరువు పటిష్టతను కోల్పోయేలా చేశారని అన్నారు. మంచిగా ఉన్న చెరువులను చెడగొట్టి కార్యకర్తల జేబులు నింపేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2010లో పూర్తి కావాల్సిన కేఎల్‌ఐ థర్డ్ లిఫ్ట్ పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయని, ఇరిగేషన్ ఈఎన్‌సీ మురళి ప్రమేయం వల్లే పనుల్లో జాప్యం జరుగుతుందని ఆరోపించారు.
ఒకప్పుడు ప్రాజెక్టుల నిర్మాణం ఆంధ్రా పాలకులు నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటిని పూర్తి చేయటంలో చిత్తశుద్ధితో లేదన్నారు. అన్ని ప్రాజెక్టులు పూర్తయితేనే తెలంగాణ రైతుల బతుకులు మారతాయన్నారు. రాష్ట్రంలో 400 మండలాల్లో కరువు వచ్చినా ప్రభుత్వం నేటికీ కరువు మండలాలను ప్రకటించకుండా, కనీసం కరువుకు సంబంధించిన రిపోర్ట్‌ను కేంద్రానికి పంపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరమని, రైతులకు భరోసా కల్పించాల్సిన పాలకులే రైతులకు మనోధైర్యం కల్పించకుండా వ్యవహరించటం వల్లే ఉత్తరప్రదేశ్‌లో రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజన్ సపరేట్ అని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో ఆయన ఉన్నారని అన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు కాశన్న, అర్థం రవి, నాగర్‌కర్నూల్ సింగిల్‌విండో అధ్యక్షులు వెంకట్రాములు, తదితరులు ఉన్నారు.