అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, రంగారెడ్డి : రాష్ట్ర బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం దక్కింది. అసెంబ్లీలో సీఎం కేసీఆర్ సోమవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రైతుల సంక్షేమానికి పెద్దపీట వేశారు. అలాగే.. నిధుల్లేక నీరసిస్తున్న పల్లెలకు ప్రతినెలా డబ్బులు అందజేస్తామని పేర్కొనడం ఊరటనిచ్చే అంశం. మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు కూడా ప్రాధాన్యమిచ్చారు. అయితే, జిల్లాలోని బీడు భూములను సస్యశ్యామలం చేసే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాత్రం నిధులు తక్కువ కేటాయించారు. గతేడాది రూ.2,179 కోట్లు కేటాయించగా.. ప్రస్తుతం రూ.500 కోట్లతో సరిపుచ్చారు.
రుణమాఫీతో రూ.1.32 లక్షల మంది రైతులకు మేలు
రైతులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంట రుణాల మాఫీకి బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. రూ.లక్ష లోపు పంట రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. బడ్జెట్‌లో పంట రుణమాఫీకి ప్రత్యేకంగా నిధులు కేటాయించడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. జిల్లాలో సుమారు 2.81 లక్షల మంది రైతులు ఉండగా.. వీరిలో రూ.లక్షలోపు పంట రుణాలు తీసుకున్న వారు 1.32 లక్షల వరకు ఉన్నారని అంచనా. రుణమాఫీ జరిగితే వీరందరికీ మేలు జరగనుంది.
అన్నదాతలకు భరోసా..
రైతుబంధు పథకాన్ని ఈ ఏడాది కూడా కొనసాగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం.. తాజాగా బడ్జెట్‌లో ఆ మేరకు కేటాయింపులు జరిపింది. దురదృష్టవశాత్తు రైతు మరణిస్తే.. ఆ కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం దక్కుతోంది. ఇలా జిల్లాలో ఇప్పటివరకు 754 మంది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. తాజాగా నిధుల కేటాయింపుతో మరిన్ని కుటుంబాలకు అండ లభించనుంది. అలాగే సాగు భారాన్ని రైతులకు తగ్గించాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న రైతుబంధు పథకానికి నిధులు కేటాయించారు. పెట్టుబడి కింద ఎకరాకు రూ.5 వేల చొప్పున ప్రభుత్వం అందజేస్తుండగా కొంతకాలంగా నిధుల కొరతతో రైతులకు సొమ్ము సకాలంలో అందడం లేదు. ఈ ఖరీఫ్‌లో 2.38 లక్షల మంది రైతులకుగాను.. 1.47 లక్షల మందికే రైతుబంధు సొమ్ము అందింది. మిగిలిన 90వేల పైచిలుకు మంది అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. నిధుల కేటాయింపుతో ఇకపై ఆ పరిస్థితి ఉండదని అధికారులు పేర్కొంటున్నారు.
మరింత మందికి ‘ఆసరా’..
కుదించిన ఆసరా పింఛన్ అర్హత వయసుకు లోబడి ఉన్న అర్హులకు ఈ ఏడాది పింఛన్ అందనుంది. ఆసరా పించన్ వయసును రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో కుదించింది. పించన్ పొందేందుకు అంతకుముందు కనిష్టంగా 65 ఏళ్లు ఉండగా.. ఈ వయసును 57కు కుదించింది. ఈ నిర్ధిష్ట వయసు గల వారి వివరాలను సేకరిస్తున్న జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ.. 32 వేలకుపైగా మంది అర్హులను ఈ ఏడాది మేలో గుర్తించింది. ఆ తదుపరి నెల నుంచి పింఛన్ సొమ్ము దక్కుతుందని లబ్ధిదారులు ఆశించారు. అయితే, మూడు నెలలు గడిచినా ఊసే లేకపోవడంతో అర్హులు అయోమయంలో పడ్డారు. తాజా బడ్జెట్‌లో వీరికి నిధులు కేటాయించడంతో వీరి ఉపశమనం కలగనుంది.
‘పాలమూరు–రంగారెడ్డి’కి అత్తెసరుగానే..
జిల్లా సాగునీటి అవసరాలు తీర్చే ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధుల తక్కుక కేటాయింపు జరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించింది. గతేడాది కేటాయింపులతో పోల్చితే ఇది నాలుగో వంతు కంటే తక్కువే. రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేసేందుకు చేపట్టిన ఈ ప్రాజెక్టును నిధుల కొరత వేధిస్తోంది. తాజాగా విద్యుత్ ఆర్థిక సంస్థ (పీఎఫ్‌సీ) నుంచి రూ.10వేల కోట్లు రుణాన్ని ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తామని పేర్కొన్న సీఎం.. వచ్చే ఏడాది నాటికి ఈ ప్రాజెక్టుకు పూర్తి చేస్తాయని తెలిపారు. నిర్దేశిత గడువులోగా పొలాలకు నీరందించడానికి యుద్ధప్రాతిపదికన పనులు చేయాల్సిన తరుణంలో స్వల్ప కేటాయింపులు చేయడంపై పలువురు పెదవి విరుస్తున్నారు.
ఇది ప్రజా బడ్జెట్..
అంతటా ఆర్థిక మాంద్యం ఉన్నా.. సంక్షేమ రంగానికి నిధుల్లో కోత పెట్టలేదు. అన్ని రంగాలకు కేటాయింపుల్లో సముచిత స్థానం కల్పించడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధికి బాటలు వేసే ప్రజా బడ్జెట్ ఇది. రుణమాఫీ, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, విద్య, వైద్యం, నీటి పారుదల, మౌలిక సదుపాయాల కల్పన కోసం భారీగా కేటాయింపులు చేసిన సీఎంకు కృతజ్ఞతలు.
– పి.సబితా ఇంద్రారెడ్డి, విద్యా శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment