శుక్రవారం హెచ్‌ఐసీసీలో తెలంగాణ పారిశ్రామిక విధానం -2015ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులు జూపల్లి, కేటీఆర్, అధికారులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ దేశాల ప్రతినిధులు
♦ పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి కేసీఆర్
♦ పారిశ్రామిక విధానం-2015 ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణకు ప్రత్యేక చరిత్ర, సంస్కృతి ఉంది. హైదరాబాద్ ఒక విశ్వనగరం. యవ్వనోత్సాహంతో ఉన్న నూతన రాష్ట్రాన్ని ఆశీర్వదించండి. ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్షించేలా మంచి పనులు చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. పెట్టుబడులతో తరలిరండి’’ అని సీఎం చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ లో శుక్రవారం ‘తెలంగాణ పారిశ్రామిక విధానం-2015 (టీఎస్ ఐపాస్)’ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వివిధ దేశాల రాయబారులు, పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖులకు నూతన విధానంలోని ప్రత్యేకతలను వివరించారు.
‘‘మాకు సమర్థులైన అధికారుల బృందం ఉంది. మా సామర్థ్యమున్నంత వరకు పనిచేసి మీ అంచనాలకు తగినట్లుగా రాణిస్తాం. లేనిదానిని ఉన్నట్లుగా చూపుతూ పత్రికలు, మీడియాలో ప్రకటనలు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం కాదు. మేం చెప్పిన దాంట్లో సగం ఆచరణలోకి వచ్చినా ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు తెలంగాణలో బారులు తీరుతారని పారిశ్రామిక ప్రముఖులు అంటున్నారు. మా పనితీరు ద్వారానే సమాధానం చెబుతాం..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అవాంతరాలు, అవినీతి లేని రీతిలో, ప్లగ్ అండ్ ప్లే విధానంలో పారిశ్రామిక విధానం ఉంటుందని.. పైరవీలు చేస్తూ, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా సులభంగా అనుమతులు ఇస్తామని హామీ ఇచ్చారు.
‘ప్రత్యేక’ స్వాగతం..
‘‘ప్రపంచంలోని ఏమూల నుంచైనా అనుమతులు కోరుతూ దరఖాస్తు చేసుకునేలా కొత్త విధానం ఉంటుంది. తెలంగాణ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ప్రత్యేక ప్రోటోకాల్ అధికారుల బృందం పారిశ్రామికవేత్తలకు ఎయిర్‌పోర్టులోనే స్వాగతం పలుకుతుంది. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారి చిత్తశుద్ధిని పరిశీలించి, అవాంతరాలు లేకుండా చూసేందుకు స్వయంగా భేటీ అవుతాను..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
నీరు, భూమి, విద్యుత్ తదితర అనుమతులను 10 నుంచి 12 రోజుల వ్యవధిలో అన్నీ ఒకే ప్యాకెట్లో పెట్టి స్వయంగా అందజేస్తానని హామీ ఇచ్చారు. అనుమతుల్లో ఆలస్యానికి బాధ్యులయ్యే ఉద్యోగులకు రోజుకు రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామన్నారు. తెలంగాణ పారిశ్రామిక ఉత్పత్తుల్లో మూడింట ఒకవంతు ఫార్మా రంగానిదేనని... ఫార్మాను ప్రోత్సహించేందుకు ముచ్చెర్లలో ఫార్మా సిటీ, ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఫార్మా అభివృద్ధికి రసాయన వ్యర్థాల నిర్వహణ అవరోధమనే భావన ఉందని, ఫార్మాసిటీలో వ్యర్థాల నిర్వహణకు ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వ్యతిరేక భావన తొలగిస్తామని ప్రకటించారు.
ఐటీసీ నుంచి రూ. 8 వేల కోట్లు..
నూతన పారిశ్రామిక విధానానికి ఆకర్షితులైన ఐటీసీ చైర్మన్ వైసీ దేవేశ్వర్ రాష్ట్రంలో రూ. 8 వేల కోట్ల పెట్టుబడికి సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ఐటీసీ భద్రాచలం పేపరు మిల్లు సామర్థ్యాన్ని మరో లక్ష టన్నులు పెంచడం ద్వారా 90 మిలియన్ల పనిదినాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లోని సైబర్‌సిటీలో రూ. వెయ్యి కోట్లతో హోటల్, మెదక్‌లో రూ.800 కోట్లతో ప్రపంచ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
తర లివచ్చిన ప్రముఖులు..
పారిశ్రామిక విధానం ఆవిష్కరణ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్వాగతోపన్యాసం చే శారు. కెనడా, ఫ్రాన్స్, టర్కీ, జపాన్ దేశాల కాన్సుల్ జనరల్‌లు సిడ్నీ ఫ్రాంక్, ఎరిక్ లావెర్టూ, మూరత్ ఒమెరోగ్లు, సీజీబాబాతో పాటు బీహెచ్‌ఈఎల్ ఎండీ ప్రసాద్‌రావు, మైక్రోమాక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్, వాల్‌మార్ట్ సీఈవో క్రిష్ అయ్యర్, జీఎంఆర్ చైర్మన్ మల్లికార్జున్‌రావు, జీవీకే చైర్మన్ జీవీకే రెడ్డి, నాస్కామ్ అధ్యక్షుడు బీవీఆర్ మోహన్‌రెడ్డి, టీసీఎస్ హెడ్ రాజన్న, సీఐపీ అధ్యక్షురాలు వనితా దాట్ల, ఫిక్కి తెలంగాణ చాప్టర్ అధ్యక్షురాలు సంగీతారెడ్డి ప్రసంగించారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, డైరక్టర్ మానిక్‌రాజ్ నూతన విధాన ప్రత్యేకతలను వివరించారు. టీఎస్ ఐపాస్ వెబ్‌సైట్‌తో పాటు సోలార్ పవర్ పాలసీని సీఎం ఆవిష్కరించారు.
అన్నీ ఒక్కచోటే..
టీఎస్ ఐపాస్ బిల్లును గత ఏడాది నవంబర్ 27న అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించగా.. మార్గదర్శకాలకు ఈనెల 10న రాష్ట్ర మంత్రివర్గం ఓకే చెప్పింది. జూన్ 12 నుంచి టీఎస్ ఐపాస్ చట్టం అమల్లోకి వస్తున్నట్లుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ విధానంలోని ప్రత్యేకతలు..
- వారంలో రెండు పర్యాయాలు దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత శాఖల తరఫున అనుమతులు జారీ చేస్తారు. పరిశ్రమల శాఖ కార్యదర్శి నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి ఐపాస్ కమిటీ దరఖాస్తుల తీరుతెన్నులను పర్యవేక్షిస్తుంది.
- రూ.200 కోట్లకుపైగా పెట్టుబడి, వెయ్యి మందికి పైగా ఉపాధి కల్పించే మెగా ప్రాజెక్టులకు సీఎస్ నేతృత్వంలోని ‘తెలంగాణ స్టేట్‌వైడ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫెసిలిటేషన్ బోర్డు (టీ స్విఫ్ట్)’ అనుమతులు మంజూరు చేస్తుంది.
- రూ. 5 కోట్ల కంటే తక్కువ పెట్టుబడులుండే పరిశ్రమలకు జీఎం, డీఐసీ నేతృత్వంలో జిల్లా స్థాయిలోనే అనుమతులు.
- వివిధ ప్రభుత్వ శాఖలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా సాధారణ దరఖాస్తు (సీఎఎఫ్) ద్వారా సింగిల్‌విండో పద్ధతిలో అనుమతులు.
- అనుమతుల మంజూరు ప్రక్రియను ఆన్‌లైన్ విధానంలో నోడల్ ఏజెన్సీలు పర్యవేక్షిస్తాయి. రూ.200 కోట్లకు పైబడి పెట్టుబడి ఉండే మెగా ప్రాజెక్టులకు 15 రోజులు, అంతకంటే తక్కువ వ్యయమయ్యే ప్రాజెక్టులకు నెల రోజుల్లో అనుమతి.
- టీఎస్ ఐపాస్ సెక్షన్ 13(1) ప్రకారం నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వకుంటే అనుమతులు వచ్చినట్లుగానే దరఖాస్తులు భావించాల్సి ఉంటుంది.
- పరిశ్రమలకు కేటాయించే భూములకు టీఎస్ ఐఐసీ నోటిఫైడ్ అథారిటీగా వ్యవహరిస్తుంది.
- లేఔట్, భవన నిర్మాణం తదితర అనుమతులను గ్రామ పంచాయతీ ద్వారా పొందాలనే నిబంధనను సవరిస్తూ టీఎస్‌ఐఐసీకి అధికారం అప్పగించారు. అయితే ఆదాయాన్ని మాత్రం గ్రామ పంచాయతీల ఖాతాలో జమ చేస్తారు.
- అనుమతుల్లో జాప్యాన్ని ప్రశ్నించే అధికారాన్ని దరఖాస్తుదారుకు అప్పగిస్తూ.. నిర్దేశిత గడువులోగా అనుమతుల పర్యవేక్షణ బాధ్యతను సంబంధిత విభాగాల అధిపతులకు అప్పగించారు.
- నిర్దేశిత గడువులోగా అనుమతులు ఇవ్వని అధికారులు, సిబ్బందికి జరిమానా విధిస్తారు. అనుమతులు పొందిన రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభించని పరిశ్రమల అనుమతి రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంటారు.
ఆశీర్వదించండి
Published Sat, Jun 13 2015 3:38 AM | Last Updated on Wed, Apr 3 2019 4:08 PM
Advertisement