గోల్కొండను అప్పగించండి
- నేడు రక్షణ మంత్రిని కోరనున్న సీఎం కేసీఆర్
- నాలుగు రోజుల పర్యటన కోసం ఢిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి
- ప్రధానితోపాటు నలుగురు కేంద్ర మంత్రులను కలిసేలా షెడ్యూల్
హైదరాబాద్: రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్రంతో చర్చించేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హస్తినబాట పట్టారు. నాలుగు రోజుల పర్యటన కోసం బుధవారం రాత్రి బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. ఆయన వెంట డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తదితరులు ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు నలుగురు కేంద్ర మంత్రులను కలుసుకునేలా షెడ్యూల్ ఖరారైంది.
గురువారం మధ్యాహ్నం రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌ను కేసీఆర్ కలుసుకోనున్నారు. ప్రస్తుతం రక్షణశాఖ అధీనంలో ఉన్న గోల్కొండ కోటను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని కోరనున్నారు. దీంతోపాటు పలు అంశాలను సీఎం ఈ సందర్భంగా ప్రస్తావించనున్నారు. ప్రధానంగా తెలంగాణలో కొత్త సైనిక్ స్కూల్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. గిరిజనులకు అందుబాటులో ఉండేలా ఈ స్కూల్‌ను వరంగల్ జిల్లాలో నెలకొల్పాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీంతోపాటు కంటోన్మెంట్ స్థలాల విషయాన్ని చర్చించనున్నారు. సికింద్రాబాద్‌లో ఇప్పుడున్న కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా నగర శివార్లలోని మెదక్ జిల్లాలో ఉన్న స్థలాలను కేటాయించటంతోపాటు కొత్త కంటోన్మెంట్ నిర్మించాలనే తన ఆలోచనను రక్షణ మంత్రికి వివరించనున్నారు. అందుకు సంబంధించిన ప్రతిపాదనలను ఆయనకు అందించనున్నారు.
ఇదే పర్యటనలో న్యాయశాఖ మంత్రి సదానందగౌడను కలుసుకొని హైకోర్టు విభజనను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేయనున్నారు. అనంతరం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్య నాయుడును కలుసుకుంటారు. శనివారం ప్లానింగ్ కమిషన్ బిల్డింగ్‌లో జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ఆయన పాల్గొంటారు. కేంద్ర ప్రాయోజిత పథకాలకు సంబంధించిన సబ్ కమిటీకి కేసీఆర్ ఇప్పటికే చైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలోనే ఏడు రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో ఈ సమావేశం జరగనుంది. ఆదివారం ప్రధాని మోదీతో కేసీఆర్ భేటీ అవుతారు. అనంతరం హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.