- నేడు ప్రధాని మోదీని కోరనున్న సీఎం
- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరువు పరిస్థితులున్నందున సహాయక చర్యలకు అదనపు ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయనున్నారు. గతంలో కేంద్రం ప్రకటించిన రూ.791 కోట్ల కరువు సాయం సరిపోదని.. ముందుగా కోరిన ప్రకారం రాష్ట్రానికి మరో రూ.3000 కోట్లు అదనంగా విడుదల చేయాలని కోరనున్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీతో పాటు పశుగ్రాస కేంద్రాలు, తాగునీటి సరఫరాకు మరిన్ని నిధులు కావాలని విజ్ఞప్తి చేయనున్నారు.
సోమవారం రాత్రి సీఎం కేసీఆర్ శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రధాని మోదీతో భేటీ అవుతారు. అనంతరం వివిధ రాష్ట్రాల సీఎంలతో కరువుపై చర్చించేందుకు ప్రధాని ఏర్పాటు చేసిన సదస్సుకు హాజరవుతారు. నియోజకవర్గాల పునర్విభజన, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి గ్రాంటు, ప్రత్యేక ప్యాకేజీ, విభజనకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలు, కొత్త జిల్లాల పెంపునకు అనుగుణంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల కేటాయింపు అంశాలను సీఎం.. ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. దీంతోపాటు కరువును శాశ్వతంగా పారదోలేందుకు రాష్ట్రంలో చేపడుతున్న సాగునీటి ప్రాజెక్టులు, ఏపీ చేస్తున్న అనవసర రాద్ధాంతాన్ని ప్రధానికి వివరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఇప్పటికే పలుమార్లు చేసిన విజ్ఞప్తిని మరోమారు గుర్తుచేస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి బి.ఆర్.మీనా సీఎం వెంట ఢిల్లీ వెళ్లారు.