యూనివర్సిటీలోని అకౌంట్ సెక్షన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఇన్‌చార్జి వీసీ అనిల్‌కుమార్
సాక్షి, డిచ్‌పల్లి : యూనివర్సిటీ సిబ్బంది అందరూ తనకు సమానమేనని, సమష్టి కృషితో తెలంగాణ యూనివర్సిటీని రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలబెడదామని సీనియర్ ఐఏఎస్ అధికారి, ఇన్‌చార్జి వీసీ వి.అనిల్‌కుమార్ అన్నారు. శుక్రవారం తెయూ ఇన్‌చార్జి వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన పరిపాలనా భవనంలో వివిధ విభాగాలను సందర్శించారు. బోధన, బోధనేతర సిబ్బందిని విభాగాల వారీగా పరిచయం చేసుకున్నారు. విద్యా సంస్థలంటే తనకెంతో ఇష్టమని, తాను చదువుకునే సమయంలోనే ఉద్యోగం సాధించడానికి వివిధ పోటీ పరీక్షలను రాశానని గుర్తు చేసుకున్నారు.
ఆచార్యుల ఆలోచనా విధానం, మార్గనిర్దేశనం ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు తెలిపారు. యూనివర్సిటీకి క్రమంగా వస్తూ ఉంటానని ప్రతి నెలలోనూ సిబ్బంది పనితీరుకు సంబం ధించి సమావేశం నిర్వహిస్తామన్నారు. అందరి సూచనలు, సలహాల ప్రకారం విద్యాపరమైన అభివృద్ధిని సాధించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెయూ మూడోస్థానంలో ఉందని, మొదటి స్థానానికి రావడానికి మనందరం సమష్టిగా పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధ్యాపకులు, విద్యార్థుల మధ్య స్నేహ పూర్వకమైన వాతావరణం ఉండాలని సూచించారు.
అధ్యాపకులు విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలన్నారు. ప్రతి విద్యార్థి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా అధ్యాపకులు కృషి చేయాలని సూచించారు. ఫలితాల్లో ప్రథమ స్థానం సాధించిన విద్యార్థికి గోల్డెన్, రెండో స్థానంలో నిలిచిన విద్యార్థికి సిల్వర్, మూడో స్థానం పొందిన విద్యార్థికి కాపర్ బ్యాడ్జెస్ వంటి గుర్తింపు కార్డులను నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలని సూచించారు. తద్వారా విద్యార్థులందరూ పోటీతత్వంతో మరింత బాగా చదివి మంచి ఫలితాలను సాధించడానికి చూస్తారని ఇన్‌చార్జి వీసీ తెలిపారు. ఆయన వెంట రిజిస్ట్రార్ ప్రొఫెసర్ బలరాములు, సీవోఈ సంపత్‌కుమార్, ఏఈ వినోద్, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment