సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు, పథకాలను ప్రజల దరికి చేర్చే విషయంలో అధికారులు అవినీతికి పాల్పడితే ఉపేక్షించేది లేదని కలెక్టర్ శ్రీదేవసేన అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా అధికారులతో వివిధ శాఖల ద్వారా అమలవుతున్న అంశాలపై సమీక్ష నిర్వహించారు. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి మొదటి సారి అధికారులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన సమావేశం రాత్రి 7 గంటల వరకు కొనసాగింది. కాగా, సీఎం కేసీఆర్ త్వరలో కలెక్టర్ల సదస్సు నిర్వహించనున్నందున అందులో ప్రస్తావించే అంశాలపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తాను రెండు విధానాలను పాటిస్తానని, ఒకటి అవినీతి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని, అధికారులు వివిధ అంశాలపై తప్పుడు సమాచారం ఇస్తే ఉపేక్షించేది లేదన్నారు. అనంతరం శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫారెస్ట్, గ్రామీణాభివృద్ధి, జిల్లాపరిషత్, పంచాయతీలలో ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు మాకు ఒక సైన్యం అన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లి అమలు చేసే బాధ్యత ఉన్న ఎంపీడీవోలను, ఎమ్మార్వోలను సైన్యం లాగా పరిగణిస్తామన్నారు. గ్రామాల్లో నర్సరీ పనులను పూర్తి చేసి మొక్కలు పెంపకానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడెక్కడ పనులు ప్రారంభించలేదో పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలను ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు ఈనెల 10లోగా పూర్తి చేయాలన్నారు. డంపింగ్ యార్డు నిర్మాణాలు, శ్మశాన వాటికల నిర్మాణాలు పూర్తి చేయాలని, ఎక్కడెక్కడ ప్రారంభించలేదో అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, కొన్ని నిర్మాణాలకు స్థలం సమస్య ఉండగా, మరికొని్నంటికీ ఫారెస్ట్ క్లియరెన్స్ సమస్య ఉందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అన్ని గ్రామాల్లో మీ మార్కు ఉండాలని, ఇంకుడుగుంతలు నిర్మించాలని, 12వేల మరుగుదొడ్లను మూడు రోజుల్లో పూర్తి చేయాలన్నారు.
ఇందులో ప్రజాప్రతినిధులను భాగస్వాములు చేయాలని, మండల ప్రత్యేక అధికారులు ఇన్వాల్వ్ కావాలన్నారు. ప్రతీ శుక్రవారం స్వచ్ఛశుక్రవారం నిర్వహించేలా నిర్ణయం తీసుకుంటామని, దీంతో కొత్త విషయాలు తెలుస్తాయన్నారు. అంతకు ముందు కలెక్టరేట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్యక్రమంలో డీఆర్వో నటరాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, జెడ్పీసీఈవో కిషన్, డీఆర్డీవో రాజేశ్వర్, డీఎఫ్‌వో ప్రభాకర్, డీఎంహెచ్‌వో చందు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment