సాక్షి, సంగారెడ్డి: మెదక్ ఉప ఎన్నిక విషయంలో ఓటరు నిరాసక్తత చూపాడు. గత సాధారణ ఎన్నికలతో పోలిస్తే శనివారం జరిగిన ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గింది. ఎన్నికలో 65.74శాతం ఓటింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే 11 శాతం మేర పోలింగ్ తగ్గింది. గత ఎన్నికల్లో 77.35 శాతం పోలింగ్ నమోదైంది. 2009లో జరిగిన ఎన్నికల్లో 76 శాతం పోలింగ్ నమోదైంది. ఉప ఎన్నికలో ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గటంతో రాజకీయపార్టీలను కొంత కలవరపాటుకు గురిచేయగా, అధికారుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
వందశాతం ఓటింగ్ సాధించేందుకు అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఫలించలేదు. దీంతో ఓటింగ్ తగ్గుదలకు గలకారణాలను వెతికే పనిలో ఎన్నికల అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు రాజకీయపార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా ఓటరును పోలింగ్ కేంద్రం వరకు తీసుకురావడంలో విఫలమయ్యారు. దీంతో ఓటింగ్ శాతం తగ్గి, తమపై ఎలాంటి ప్రభావం చూపుతుందోనని అంచనా వేసే పనిలో ప్రధాన రాజకీయపార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు నిమగ్నమయ్యాయి. విజయంపై ధీమాగా ఉన్న టీఆర్‌ఎస్‌కు ఓటింగ్ శాతం తగ్గుముఖం పట్టడం కొంత కలవరపెడుతోంది. ఆ పార్టీకి పట్టు ఉన్న సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలోనూ ఓటింగ్ శాతం 70 శాతం లోపే ఉంది.
భారీ మెజార్టీయే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ఎన్నికల బరిలో దిగింది. అయితే ఓటింగ్ శాతం తగ్గటంతో మెజార్టీ తగ్గవచ్చని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. గత ఎన్నికలో మెదక్ ఎంపీగా పోటీ చేసిన కె.చంద్రశేఖర్‌రావుకు 3.97 లక్షల మెజార్టీ వచ్చింది. ప్రస్తుతం ఓటింగ్ శాతం తగ్గటంతో ఊహించిన స్థాయిలో మెజార్టీ రాకపోవచ్చని టీఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు కూడా ఓటింగ్ శాతం తగ్గడంతో తమ విజయావకాశాలపై ప్రభావం చూపవచ్చని భావిస్తున్నాయి. తమకు అండగా నిలుస్తారనుకున్న సాంప్రదాయ ఓటర్లు, ఎస్సీ,ఎస్టీలు ఓటింగ్‌లో ఎంత మేర పాల్గొన్నారో అంచనా వేసే పనిలో కాంగ్రెస్ పెద్దలు నిమగ్నమయ్యారు. మరోవైపు బీజేపీ సైతం ఓటింగ్ సరళిని విశ్లేషించే పనిలో ఉంది. ఓటింగ్ శాతం తగ్గుదల ప్రభావం తమపై ఎలా ఉంటుందోనని బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి నియోజకవర్గస్థాయి ముఖ్యనేతలతో చర్చించినట్లు సమాచారం.
ఏడు నియోజకవర్గాల్లోనూ అదే తీరు...
మెదక్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ ఓటింగ్ శాతం తగ్గింది. గత ఏప్రిల్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, పటాన్‌చెరు, నర్సాపూర్ నియోజవకర్గాల్లో 77.35 శాతం పోలింగ్ నమోదు కాగా శనివారం నాటి ఉప ఎన్నికల్లో 65.74శాతం నమోదైంది. ఓటింగ్ శాతంలో స్వల్ప తేడా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.
నర్సాపూర్‌లో అత్యధికంగా 77 శాతం పోలింగ్ కాగా పటాన్‌చెరు నియోజకవర్గంలో 52 శాతం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికల్లో ఓటింగ్ శాతం నమోదు ఇలా ఉంది.
తగ్గిన ఓటింగ్‌తో పార్టీల్లో కలవరం!
Published Sun, Sep 14 2014 12:28 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement