గంట ముందు కూడా మాట్లాడాడు...అంతలోనే...
- బియాస్ ప్రమాదంలో ఖమ్మం వాసి కిరణ్ గల్లంతు
- విషాదంలో కుటుంబసభ్యులు
ఖమ్మంక్రైం : హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియాస్ నది వద్దకు విహారయాత్రకు వెళ్లి గల్లంతయిన వారిలో ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్ అనే విద్యార్థి ఉండడం స్థానికులను కలచి వేస్తోంది. హుషారుగా, చలాకీగా ఉండే కిరణ్ జల ప్రవాహంలో కొట్టుకుపోయాడని వస్తున్న వార్తలు అతని కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపాయి. కిరణ్ ఆచూకీ తెలియడం లేదన్న సమాచారంతో తల్లిదండ్రులిద్దరూ హుటాహుటిన హైదరాబాద్, హిమాచల్ ప్రదేశ్‌లకు బయలుదేరి వెళ్లారు. కుమారుని ఆచూకి కోసం వారు పడుతున్న బాధ వర్ణనాతీతంగా ఉంది.
గోళ్లపాడు టీచర్ కుమారుడు
ఖమ్మం నగరం మామిళ్లగూడెంకు చెందిన ముప్పిడి వెంకటరమణ ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడులోని ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (మ్యాథ్స్)గా పనిచేస్తున్నారు. తల్లి పద్మావతి గృహిణి. వారి రెండో కుమారుడు కిరణ్‌కుమార్ హైద్రాబాద్ శివారులోని బాచుపల్లి వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాలలో బీటెక్ (ఎలక్ట్రానిక్స్ ఇన్‌స్ట్రుమెంటేషన్) చదువుతున్నాడు. ప్రస్తుతం మూడో సంవత్సరం చదువుతున్న కిరణ్ తన చదువు పూర్తయితే అన్న లాగానే అమెరికా వెళ్లి స్థిరపడదామనుకున్నాడు. కానీ, విధి వంచించడంతో ఆకస్మాత్తుగా వరద నీటిలో గల్లంతయ్యాడు.
జాగ్రత్తలు చెప్పి పంపిన అమ్మా... నాన్న
రెండో సంవత్సరం పూర్తయినందున విద్యార్థులందరూ విహారయాత్రకు వెళుతున్నారని, తాను కూడా వెళతానని కిరణ్ తండ్రి వెంకటరమణకు ఫోన్ చేశాడు. కుమారుని కోరికను కాదనలేని తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు చెప్పి పంపారు. దీంతో ఈ నెల 3వ తేదీన అందరితోపాటు బయలుదేరి వెళ్లాడు. టూర్ ప్లాన్‌లో భాగంగా తొలుత ఆగ్రా చేరుకోగానే కిరణ్ తండ్రికి ఫోన్ చేసి తను ఆగ్రాలో ఉన్నానని చెప్పాడు. అనంతరం ఫతేపూర్, సిక్రీ పరిసర ప్రాంతాలు చూసి ఢిల్లీకి చేరుకున్నారు. ఈ నెల 6 న ఢిల్లీలోని అక్షరధామ్ మందిరం చూసి అదే రోజు సాయంత్రం సిమ్లాకు బయలుదేరే ముందు కూడా కిరణ్ తన తండ్రి రమణకు ఫోన్ చేశాడు. సిమ్లా సందర్శించిన తరువాత కులుమనాలి బయలు దేరి మార్గ మధ్యలో మండి జిల్లాలోని పండో డ్వాం- లార్జీ డ్యామ్‌కు మధ్య ఉన్న ప్రదేశం అందంగా ఉందని అక్కడ ఫోటోలు దిగేందుకు వెళ్లారు.
అక్కడి బియాస్ నదిలోకి దిగి ఫోటోలు తీస్తుండగా సాయంత్రం 6.30 నిమిషాల సమయంలో లార్జీ జలాశయంలో అకస్మాత్తుగా వరద రావడంతో స్నేహితులతో పాటు కిరణ్ కూడా గల్లంతయ్యాడు. టూర్‌లో ఉన్నన్ని రోజులూ కిరణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడుతూనే ఉన్నాడని సమీప బంధువులు చెపుతున్నారు. ప్రమాదం సంభవించడానికి గంట ముందు కూడా మాట్లాడినట్లు చుట్టుపక్కల వారు చెబుతున్నారు.
సమాచారం అందక...ఆందోళన
సంఘటన జరిగిన విషయం తెలియగానే ఆందోళనతో కిరణ్‌కు తండ్రి వెంకటరమణ ఫోన్ చేశారు. అయితే, ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో తల్లిదండ్రుల్లో మరింత ఆందోళన పెరిగింది. కుమారుడి ఆచూకీ కోసం తోటి విద్యార్థులకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. దీంతో కళాశాలకు ఫోన్ చేయగా, ఇంకా తమకు సరైన సమాచారం రాలేదని చెప్పారు. దీంతో ఆదివారం అర్ధరాత్రి కిరణ్ తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్ వెళ్లారు. అక్కడి నుంచి తండ్రి రమణ హిమాచల్ ఘటనా స్థలానికి వెళ్లినట్టు తెలుస్తోంది.
అన్నబాటలో నడుద్దామనుకుని...
కిరణ్‌కుమార్ విద్యాభ్యాసం ఖమ్మంలోనే జరిగింది. పదోతరగతి వరకు న్యూ ఎరా స్కూల్‌లో చదివిన కిరణ్ ఇంటర్ సీవీ రామన్ కళాశాలలో పూర్తి చేశాడు.కిరణ్‌కుమార్ అన్న ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. బాచుపల్లిలోని వీఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతిలోనే అతను కూడా ఇంజనీరింగ్ పూర్తి చేశాడు.ఆ తర్వాత అమెరికాలో పోస్టు గ్రాడ్యుయేషన్ సీటు లభించింది. దీంతో అన్న బాటలోనే తమ్ముడిని కూడా అమెరికా పంపుదామన్న ఆలోచనతో అదే కళాశాలలో కిరణ్‌ను చేర్పించారు తల్లిదండ్రులు. అన్న లాగానే కిరణ్ కూడా హైదరాబాద్‌లోని తన మేనమామ దగ్గర ఉండి చదువుకునే వాడని బంధువులు చెపుతున్నారు. మరో ఏడాది పూర్తయితే ఉన్నత చదువులకు వెళ్లాల్సిన కిరణ్ అకస్మాత్తుగా గంగమ్మ ఒడిలో కలిసిపోవడం అందరినీ బాధిస్తోంది. కిరణ్‌కుమార్ చదువులో చాలా చురుకుగా ఉండేవాడని కిరణ్‌కుమార్ తండ్రి వెంకటరమణ స్నేహితుడు రవికుమార్ తెలిపారు. మంచి భవిష్యత్ ఉన్న కిరణ్‌కుమార్ నీటిలో గల్లంతు కావడం తనను ఎంతో బాధించిందని ఆయన తెలిపారు.