శోకమే మిగిలింది
ఖమ్మం క్రైం: గత 15 రోజులుగా తీవ్ర ఆవేదనతో నిరీక్షిస్తున్న ఆ తల్లిదండ్రులకు చివరికి శోకమే మిగిలింది. హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో ఈనెల 8న గల్లంతైన ఖమ్మం నగరానికి చెందిన ముప్పిడి కిరణ్‌కుమార్ మృతదేహం ఆదివారం లభ్యమైంది. కుమారుడి మృతదేహం లభించిందని తెలుసుకున్న తల్లిదండ్రులు తల్లడిల్లారు. చేతికి అందివచ్చిన కొడుకు ఇలా తిరిగిరాని లోకాలకు చేరాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. కిరణ్‌కుమార్ గల్లంతైన నాటినుంచి తమ కొడుకు క్షేమంగా తిరిగి వస్తాడని వారు ఆశగా ఎదురుచూశారు. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారిలో ఆందోళన పెరిగింది.
ఇక తమ కుమారుడు బతికే అవకాశం లేదని, కనీసం కడసారి చూపు అయినా దక్కుతుందో లేదోనని ఆవేదనకు గురయ్యారు. కిరణ్ గల్లంతయ్యాడని తెలుసుకున్న వెంటనే తల్లి పద్మావతి హైదరాబాద్‌లోని బంధువుల వద్దకు వెళ్లగా, తండ్రి వెంకటరమణ హిమాచల్ ప్రదేశ్ వెళ్లారు. గాలింపు చర్యలు జరుగుతున్న బియాస్ నది వద్దే ఉంటూ కొడుకు ఆచూకీ కోసం ఎదురు చూశారు. రోజులు గడుస్తున్నా జాడ తెలియకపోవడంతో ఆయనతోపాటు మిగితా విద్యార్థుల తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. కిరణ్ మేనమామ నరసింహారావు మాత్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉండి ఎదురు చూడసాగారు. చివరకు ఆదివారం మధ్యాహ్నం మృతదేహం లభ్యంకావడంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా భోరున విలపించారు.
నేడు ఖమ్మంలో అంత్యక్రియలు...
కిరణ్‌కుమార్ అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ఖమ్మంలో నిర్వహించనున్నారు. మృతదేహాన్ని హిమాచల్ ప్రదేశ్ నుంచి సోమవారం మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తీసుకొస్తారు. అక్కడినుంచి సాయంత్రానికి ఖమ్మంలోని బుర్హాన్‌పురంలో ఉన్న స్వగృహానికి తరలిస్తారు. అక్కడ కొద్దిసేపు ఉంచిన అనంతరం అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలిపారు.
దుస్తులు చూసి గుర్తుపట్టిన మేనమామ..
బియాస్ నదిలో ఆదివారం మధ్యాహ్నం కిరణ్ మృతదేహం లభించింది. అయితే కిరణ్‌కుమార్ మేనమామ నరసింహారావు బియాస్ నది వద్దనే ఉంటూ ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మృతదేహం దొరికిన సమయంలో దుస్తులను చూసిన నరసింహారావు ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కాసేపటి తర్వాత తేరుకుని ఇది తన మేనల్లుడి మృతదేహమేనని రోదిస్తూ ధ్రువీకరించారు. తనకు ఎంతో ఇష్టమైన మేనల్లుడు ఇలా విగతజీవిగా కనిపించడంతో కన్నీరు మున్నీరుగా విలపించాడు. ఇండియన్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన నరసింహారావు హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్‌లో నివాసం ఉంటున్నారు. కిరణ్ ఆయన వద్దనే ఉంటూ ఇంజనీరింగ్ చదువుతున్నాడు.