సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రెండో విడత మెడికల్ కౌన్సెలింగ్ నిలిచిపోయింది. అఖిల భారత కోటా సీట్లకు జరిగిన రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు ప్రకటించకపోవడంతో ఆ ప్రభావం ఇక్కడి కౌన్సెలింగ్‌పై పడింది. రెండో విడత కౌన్సెలింగ్ ఎప్పుడు నిర్వహిస్తారో అయోమయం నెలకొనడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. బుధవారం నుంచే ఎంబీబీఎస్, బీడీఎస్ తరగతులు ప్రారంభం కానుండటంతో అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
పెరిగిన అవకాశాలు
‘నీట్’ప్రవేశ పరీక్ష ఆధారంగానే దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాలకు అడ్మిషన్లు జరుగుతున్నాయి. అలాగే నేషనల్ పూల్‌లో 15 శాతం ప్రభుత్వ సీట్లు వచ్చి చేరా యి. మరోవైపు డీమ్డ్ వర్సిటీలకూ ఒకే దరఖాస్తు కావ డంతో విద్యార్థులకు అవకాశాలు పెరిగాయి. అఖిల భారత కోటా రెండో విడత కౌన్సెలింగ్‌పై కొందరు కోర్టుకు వెళ్లడంతో వాటి ఫలితాలు నిలిచిపోయాయి. దీంతో తెలంగాణలో రెండో విడతకు అడ్డంకులు ఏర్పడ్డాయి.
అఖిల భారత సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుంది. తర్వాత కౌన్సెలింగ్‌లు నిర్వహించరు. కాబట్టి ఆ తర్వాత రాష్ట్రంలో కౌన్సెలింగ్‌లు నిర్వహిస్తే ఎక్కడికక్కడ విద్యార్థులు చేరిపోతారు. ఈ నేపథ్యంలో అక్కడ రెండో విడత కౌన్సెలింగ్ ఫలితాలు వచ్చాకే రాష్ట్రంలో రెండో విడత నిర్వహించనున్నారు. కాగా, అఖిల భారత సీట్ల రెండో విడత ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారో తమకు తెలియదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ కరుణాకర్‌రెడ్డి తెలిపారు.
నేటి నుంచి ఎంబీబీఎస్ తరగతులు
ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి సంవత్సరం తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో సిద్దిపేట మెడికల్ కాలేజీ ఈ ఏడాది నుంచి ఉనికిలోకి వచ్చింది. ప్రైవేటుకు సంబంధించి అయాన్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సు ప్రారంభమైంది. ఇప్పటివరకు అన్ని కేటగిరీల తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నేతృత్వంలో కన్వీనర్ కోటాలోని 1,800 ఎంబీబీఎస్.. 590 బీడీఎస్ సీట్ల భర్తీ పూర్తయింది. అక్కడక్కడ కొన్ని సీట్లు మిగిలాయి.
15 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో 2,100 ఎంబీబీఎస్ సీట్లుండగా వాటిలో బీ కేటగిరీ 676, సీ కేటగిరీ సీట్లు 319 ఉన్నాయి. వీటికి తొలి విడత కౌన్సెలింగ్ పూర్తయింది. బీ కేటగిరీ సీట్లలో దాదాపుగా అందరూ చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. సీ కేటగిరీలో ఇంకా 120 సీట్లు భర్తీ కాలేదు. దీంతో ఆ సీట్లు భర్తీ అవుతాయో లేదోనని కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి.
90 శాతం చేరికలు
ఇప్పటివరకు 90 శాతం సీట్లలో విద్యార్థులు చేరారని కరుణాకర్‌రెడ్డి తెలిపారు. బుధవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయని చెప్పారు. మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనల ప్రకారం దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ మొదటి ఏడాది తరగతులను ఏటా ఆగస్టు ఒకటి నుంచి ప్రారంభించాలి. అప్పుడే వైద్య విద్యా సంవత్సరం సక్రమంగా జరుగుతుంది. ఈసారి అనేక మంది తెలంగాణ విద్యార్థులు దేశంలోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించినట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment