సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఎడతెగని ఉత్కంఠకు తెరపడింది. ఎట్టకేలకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా సోమవారం సాయంత్రం విడుదలైంది. మహేశ్వరం మినహా జిల్లాలోని మిగతా 13 శాసనసభా స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. పొత్తులో భాగంగా మహేశ్వరం సీటును సీపీఐకి కేటాయించడంతో జాబితాలో నియోజకవర్గం పేరు చేర్చలేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ఆకుల రాజేందర్‌కు కాంగ్రెస్ అధిష్టానం రిక్తహస్తం చూపింది.
కుటుంబానికి ఒకే సీటు అనే నిబంధన కారణంగా సబితకు టికెట్ నిరాకరించగా, టీఆర్‌ఎస్‌కు మారి తిరిగి సొంతగూటికి చేరిన ఆకుల రాజేందర్‌కు శృంగభంగ మైంది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి స్వయంగా రాజకీయాల నుంచి తప్పుకొని సోదరుడు ల క్ష్మారెడ్డికి టికెట్ ఇప్పించుకున్నారు. గత ఎన్నికల్లో పరాజయం పాలైన యాదయ్య, జ్ఞానేశ్వర్‌కు పార్టీ మరోసారి అవకాశం కల్పించగా, మాజీ మంత్రి కమతం రాంరెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు కేఎం ప్రతాప్‌లను హైకమాండ్ కరుణించలేదు. 2009లో పరిగిలో రెబల్‌గా పోటీచేసిన రామ్మోహన్‌రెడ్డికి ఈసారి పార్టీ టికెట్ వరించింది.
మోదం.. ఖేదం
టికెట్ల కేటాయింపులో హైకమాండ్ చాలా జాగ్రత్తగా వ్యవహరించింది. సామాజిక సమతుల్యతకు పెద్దపీట వేసి సగం స్థానాలు బీసీలకే కేటాయించింది. మిగతావాటిలో నలుగురు రెడ్డి, ఇద్దరు ఎస్సీలకు అవకాశం కల్పించింది. కాగా, జిల్లాలో ఒక్క మహిళకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి అవకాశం దక్కలేదు. గత ప్రభుత్వంలో కీలక పదవులు చేపట్టిన సబితకు టికెట్ రాకపోవడంతో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సీట్ల కేటాయింపులో సిఫార్సులకు ప్రాధాన్యతనిచ్చిన అధిష్టానం.. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం ఒత్తిడిలను పట్టించుకోలేదు.
మేడ్చల్ సీటును తన అనుచరుడు ఉద్దెమర్రి నర్సింహారెడ్డికి ఇప్పించుకోవాలని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి చివరి నిమిషం వరకు ప్రయత్నించినా పట్టించుకోని హైకమాండ్ పెద్దలు సిట్టింగ్ ఎమ్మెల్యే కేఎల్లార్‌కే సీటు కట్టబెట్టారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఎల్‌బీనగర్ స్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఇక్కడి నుంచి తన అనుచరుడు రామ్మోహన్‌గౌడ్‌ను బరిలో దించాలనుకున్న స్థానిక ఎంపీ సర్వే సత్యనారాయణకు చుక్కెదురైంది. అలాగే ఇబ్రహీంపట్నం స్థానం టికెట్‌ను మాజీ శాసనసభ్యుడు మల్‌రెడ్డి రంగారెడ్డికి ఇప్పించుకునేందుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. చేవెళ్ల సీటును తన వర్గానికి చెందిన వెంకటస్వామికి దక్కేలా పావులు కదిపిన సబితకు నిరాశే మిగిలింది. కమతం రాంరెడ్డికి టి కెట్ ఇప్పించుకునేందుకు కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి తెరవెనుక జరిపిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
ఫలించిన పైరవీలు
పార్టీ అగ్రనేతల కోటాలో పలువురు టికెట్లు సొంతం చేసుకున్నారు. కేంద్ర మంత్రి చిరంజీవి సిఫార్సుతో బోయిన్‌పల్లి కార్పొరేటర్ నర్సింహయాదవ్‌కు కూకట్‌పల్లి అభ్యర్థిత్వం దక్కింది.ఈ స్థానం సినీ నిర్మాత ఆదిశేషగిరిరావుకు ఖరారైందని ప్రచారం జరిగినప్పటికీ, పీఆర్‌పీ నుంచి కార్పొరేటర్‌గా గెలుపొందిన నర్సింహాయాదవ్‌కు టికెట్ ఇప్పించుకోవడంలో చిరంజీవి సక్సెస్ అయ్యారు. స్థానిక ఎంపీ అడ్డుపడినా.. సుధీర్‌రెడ్డి ఢిల్లీస్థాయిలో తన పలుకుబడిని ఉపయోగించి ఎల్‌బీనగర్ బీ ఫారం దక్కించుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని గ్రేటర్ కోఅప్షన్ సభ్యుడు శ్రీధర్‌కు మల్కాజిగిరి స్థానం దక్కడంలో కేంద్ర మంత్రి సర్వే కీలక పాత్ర పోషించారు. ఆసక్తి రేకెత్తించిన ఇబ్రహీంపట్నం టికెట్టు డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్ వశమైంది. కర్ణాటక సీఎం సిద్ధిరామయ్య అండతోనే మల్లేశ్ బీ ఫారం దక్కించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదిలావుండగా, తనను వరించిన తాండూరు టికెట్టును కాదనుకున్న రమేశ్ తన బాబాయ్ నారాయణరావు పేరును సిఫార్సు చేసి బీ ఫారం ఇప్పించడం విశేషం.
సీపీఐ ఖాతాలో మహేశ్వరం
సిట్టింగ్ స్థానాన్ని తిరిగి తన అనుచరులకు ఇప్పించుకోవాలన్న సబిత ప్రయత్నాలకు అధిష్టానం గండికొట్టింది. పొత్తులో భాగంగా మహేశ్వరం సెగ్మెంట్‌ను సీపీఐకి కేటాయించడంతో చెల్లెమ్మ గొంతులో పచ్చివెలక్కాయపడ్డట్లయింది. తన కుమారుడు కార్తీక్‌రెడ్డి పోటీచేస్తున్న చేవెళ్ల పార్లమెంటరీ స్థానం పరిధిలోనే మహేశ్వరం ఉంది. ఇప్పుడు ఈ స్థానాన్ని కామ్రేడ్లకు కేటాయించడం తనయుడి విజయావకాశాలపై ప్రభావం చూపుతుందేమోననే బెంగ ఆమెను వెంటాడుతోంది. మరోవైపు ఈ సారి రాజేంద్రనగర్ నుంచి బరిలో దిగాలనే ఆమె ఆశలపై అధిష్టానం నీళ్లుచల్లింది. కుటుంబానికి ఒకే సీటు పద్ధతి సబితమ్మ సీటుకు ఎసరు తెచ్చింది. రాజేంద్రనగర్ స్థానాన్ని తన వైరివర్గానికి చెందిన జ్ఞానేశ్వర్ ముదిరాజ్‌కు కేటాయించడం ఆమెకు మింగుడుపడని అంశం.
రెంటికి చెడ్డ రాజేందర్
మల్కాజిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణతో పొసగక.. టికెట్ రాదేమోననే అనుమానంతో టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. మరుసటి రోజు రాజకీయాల నుంచి విరమించుకున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం మళ్లీ సొంతగూటికి చేరుకున్న ‘ఆకుల’ను పార్టీ అక్కున చేర్చుకున్నప్పటికీ టికెట్ మాత్రం నిరాకరించింది. ఇదిలావుండగా, మల్కాజిగిరి స్థానాన్ని బీజేపీకి కేటాయించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావుకు ఆశించిన ఫలితం దక్కలేదు.
ఉత్కంఠకు తెర
Published Mon, Apr 7 2014 11:44 PM | Last Updated on Mon, Mar 18 2019 8:56 PM
Advertisement
Advertisement