
లక్ష్యం ఏమిటి..? వెనుక ఎవరున్నారు?
- బీసీల సమావేశంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా
- కూపీ లాగుతున్న సీనియర్ నేతలు
- ఇప్పుడీ సమావేశం ఎందుకని అసహనం
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలోని బీసీ నేతలు ప్రత్యేకంగా సమావేశం పెట్టుకోవడం పై ఆ పార్టీ అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్రం లో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌పై పోరాట కార్యాచరణ పెరుగుతున్నదనుకుంటున్న ఈ సమయంలోనే కాంగ్రెస్‌లో ప్రత్యేకంగా బీసీ ఫోరం ఏర్పాటు చేయడం వెనుక ఉన్న అసలు కారణాలేమిటని పలువురు నేతలను ప్రశ్ని స్తున్నారు. ఈ సమావేశం పెట్టడానికి సూత్రధా రులు, పాత్రధారులు ఎవరన్నదానిపై ఏఐసీసీ వర్గాలు కూపీ లాగుతున్నట్టుగా తెలిసింది. బీసీ వర్గానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యను టీపీసీసీ అధ్యక్షునిగా ప్రకటించి, బీసీ నేత నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్లామని, ఇంకా ఎన్నికలకు రెండేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో పార్టీకి ప్రత్యామ్నా యంగా మరో ఫోరం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమిటో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ సమావేశానికి సంబంధించిన పూర్తి అంశా లపై సమాచారాన్ని సేకరిస్తోంది. బయటకు చెప్పిన కారణాల్లో వాస్తవమున్నా, లేకున్నా నేపథ్యాన్ని, ఈ ఫోరం ఏర్పాటు లక్ష్యాలను పూర్తిగా తెలుసుకుంటున్నది.
బీసీ సెల్‌లోనే చర్చించుకోవచ్చుగా...?
టీపీసీసీకి అనుబంధంగా ఓబీసీ సెల్ ఉందని, ఆ సమావేశంలోనే అన్ని అంశాలను చర్చించు కుంటే సమస్య ఉండేది కాదని టీపీసీసీ నాయ కులు అంటున్నారు. పార్టీలో అంతర్గత సమస్య లుంటే, అంతర్గత వేదికల్లోనే ప్రస్తావించి, పరి ష్కరించుకోవాలని, బహిరంగంగా మాట్లాడు కుంటే ఎలా పరిష్కారం అవుతాయని వారు ప్రశ్నిస్తున్నారు. ‘కాంగ్రెస్‌పార్టీకి బీసీ సెల్ లేదా? పార్టీకి, పార్టీకి అనుబంధ సంఘమైన బీసీ సెల్‌కు ప్రత్యామ్నాయంగా, సమాంతరం గా వేదిక ఏర్పాటుచేయడం ద్వారా ఈ ఫోరం పార్టీకి వ్యతిరేకం అనే సంకేతాన్ని ఇస్తోంది. భవిష్యత్తులో కాంగ్రెస్‌లోని మరో వర్గం లేదా మరో సెల్‌కూడా సమావేశం పెట్టుకుంటే ఏమ వుతుంది? చివరకు తెలంగాణ కాంగ్రెస్ ఫోరం కూడా పెట్టుకుంటారు. దీనివల్ల పార్టీకి నష్టం కలగదా? ఇలాంటి వాటి పట్ల కఠినంగా వ్యవ హరించాలని అధిష్టానాన్ని కోరుతాం’ అని టీపీసీసీ ముఖ్యనాయకుడొకరు చెప్పారు.
పార్టీ ఏం తక్కువ చేసింది?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఏం తక్కువ చేసిందని పార్టీలోని బీసీ నేతలు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌సహా మరే ఇతర పార్టీల కన్నా కాంగ్రెస్ పార్టీయే బీసీలకు ఎక్కువగా అవకాశాలను ఇచ్చిందని వి.హనుమంతరావు, చిత్తరంజన్‌దాస్ వంటి బీసీ నేతలు వాదిస్తున్నారు. గత ఎన్నికల సందర్భంగా బీసీ నేతకే టీపీసీసీ బాధ్యతలను అప్పగించిందని, 35 మంది బీసీలకు ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు దక్కాయని మరి కొందరు బీసీ నేతలు గుర్తుచేస్తున్నారు. బీసీలకు అవకాశం ఇవ్వకుండా గత ఎన్నికల తర్వాత జరిగిన నిర్ణయాలు ఏమున్నాయని, ఇలాంటి తొందరపాటు నిర్ణయాల వల్ల పార్టీకి నష్టం చేసినట్టు అవుతుందని బీసీ వర్గానికి చెందిన కొందరు సీనియర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.