
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం ఇరురాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుపై కోర్టు తీర్పు, అలాగే తెలంగాణలో అకాల వర్షాల వల్ల జరిగిన పంటనష్టంపై గవర్నర్‌కు వినతి పత్రం అందజేశారు. అయితే గవర్నర్‌తో జరిగిన సమావేశాన్ని ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బహిష్కరించారు. ఆయన లోనికి వెళ్లకుండా రాజ్‌భవన్ బయటే ఉండిపోయారు.
గవర్నర్‌తో భేటీ అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు అంశంపై హైకోర్టు తీర్పు వచ్చినా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఇదే అంశంపై గవర్నర్‌ను కలిసినట్టు తెలిపారు. సంపత్ కుమార్, కోమటిరెడ్డిల సభ్యత్వం పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరామన్నారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారని వెల్లడించారు.
కార్యదర్శికి వినతిపత్రం
మరోవైపు ఇద్దరు ఎమ్మెల్యేల శాసన సభ్యత్వం రద్దుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల చేత ఎన్నుకోబడి, ప్రజల సమస్యలను సభ దృష్టికి తీసుకురావల్సిన గౌరవ సభ్యుల సభ్యత్వాన్ని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర పరిపాలన యంత్రాంగం వెంటనే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా కోర్టు తీర్పును అమలు చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హామీ ఇచ్చినట్లు భట్టి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment