టీఆర్‌ఎస్‌పై ఔదార్యమెందుకు..? | Congress leaders on the Digvijay intolerance | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌పై ఔదార్యమెందుకు..?

Published Wed, Jan 21 2015 2:15 AM | Last Updated on Mon, Mar 18 2019 8:51 PM

టీఆర్‌ఎస్‌పై ఔదార్యమెందుకు..? - Sakshi

టీఆర్‌ఎస్‌పై ఔదార్యమెందుకు..?

కాంగ్రెస్ నేతలపై దిగ్విజయ్ అసహనం  
సమన్వయ కమిటీ భేటీలో హితబోధ

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ అంత ఉదారంగా ఎందుకు వ్యవహరిస్తున్నారంటూ నేతలపై అసహనం ప్రదర్శించారు.

మంగళవారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ సమన్వయ సంఘం భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పార్టీ పనితీరును దిగ్విజయ్ సమీక్షించారు. తర్వాత పార్టీ ముఖ్యులతోనూ బృందాలవారీగా సమావేశమయ్యారు. ఏఐసీసీ నేత కొప్పుల రాజు, పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కార్యనిర్వాహక అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత కె.జానారెడ్డి, మండలి నేత డి.శ్రీనివాస్, కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి తదితరులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో పార్టీని పటిష్టపరిచేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై నేతల అభిప్రాయాలను దిగ్విజయ్ తెలుసుకున్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై రాష్ట్ర కాంగ్రెస్, శాసనసభాపక్షం వ్యవహరిస్తున్న తీరుపై సమన్వయ భేటీలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘సొంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే పార్టీ ఏం చేస్తున్నది? ఫిరాయింపులపై ఎన్నో ఆంక్షలున్నా, మన పార్టీ నుంచి గెలిచిన చట్టసభ్యులు టీఆర్‌ఎస్ కండువాలు కప్పుకుని అసెంబ్లీలో తిరుగుతుంటే చట్టపరంగా, ప్రజల్లోను ఎందుకు మీరు నిరసనలు తెలపడం లేదు? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇళ్ల ముందు పార్టీపరంగా ఎందుకు నిరసనలు చేయలేదు? కోర్టుల్లో ఎందుకు పోరాడటం లేదు?‘’ అంటూ ఆగ్రహించారు.

పలు స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు పార్టీని వీడుతుంటే నాయకత్వం ఏం చేస్తున్నదని, వలసలను ఎందుకు నిరోధించడం లేదని నిలదీశారు. రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం పేరును మారిస్తే కూడా కాంగ్రెస్ నేతలు కోర్టును ఎందుకు ఆశ్రయించలేదుంటూ నిలదీశారు. ‘‘టీఆర్‌ఎస్‌కు ఇచ్చిన సమయం చాలు. క్షేత్రస్థాయిలో ప్రజలతో సంబంధాలు పెంచుకుని, బహుముఖ పోరాటాలకు సిద్దం కండి’’ అంటూ దిశానిర్దేశం చేశారు.

పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్న ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు తదితరులపైనా న్యాయపోరాటం చేయాలని పీసీసీ న్యాయవిభాగం అధ్యక్షుడు దామోదర్ రెడ్డికి సూచించారు. వారి ఫిరాయింపులపై ముందుగా కలెక్టర్లకు ఫిర్యాదు చేయాలని, స్పందన లేకుంటే కలెక్టర్లపై కూడా కోర్టుల్లో పోరాటం చేయాలని ఆదేశించారు. ఈ అనైతిక చర్యలపై ప్రజల్లోనూ బాగా ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్సీల ఫిరాయింపులపై తమ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు తీసుకుందనీ, ఎమ్మెల్యేల ఫిరాయింపులపైనా పిటిషన్ వేశామని నేతలు దిగ్విజయ్‌కు వివరించారు.

పార్టీకో మీడియా ఉండాల్సిందే...
తెలంగాణలో పార్టీలవారీగా మీడియా సంస్థలున్నా కాంగ్రెస్‌కు అలాంటిదేమీ లేదని కొందరు నేతలు అభిప్రాయపడ్డారు. పార్టీకి కనీసం సాయంకాల పత్రికనైనా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను అధ్యయనం చేయడానికి కాళోజీ పేరిట సెంటర్ ఫర్ నాలెడ్జ్ మేనేజ్‌మెంట్‌ను ఏర్పాటు చేయాలని నేతలు ప్రతిపాదించారు.

ప్రభుత్వ విధాన నిర్ణయాలు, జీవోలు, పాలనాపరమైన లోపాలపై ఏ రోజుకారోజు అధ్యయనం చేయడానికి ప్రత్యేక అధ్యయన కేంద్రాన్ని పీసీసీకి అనుబంధంగా తేవాలని పార్టీ ముఖ్య అధికారప్రతినిధి శ్రవణ్ ప్రతిపాదించారు. దీనికి నేతలంతా సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వ విధానాల అధ్యయనానికి షాడో కేబినెట్‌ను ఏర్పాటుచేయాలని కొందరు నేతలు సూచించారు.
 
సామాజిక మీడియాపై నజర్....
ఫేస్‌బుక్, ట్వీటర్ వంటి సామాజిక సైట్లలోనూ రాష్ట్ర పార్టీ చురుగ్గా ఉండాలని నేతలకు దిగ్విజయ్ సూచించారు. ఇందుకోసం కాంగ్రెస్‌కు సానుభూతిపరులైన ఐటీ నిపుణులతో బుధవారం భేటీ కావాలని ఆదేశించారు. ఉద్యమాల్లో పనిచేస్తున్న సంఘాలు, మేధావులు, నిపుణులతోనూ ఈ నెల 23న ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
 
పార్టీ పునర్వ్యవస్థీకరణ..
ఫిరాయింపుల వల్ల డీసీసీలతోపాటు మండల స్థాయిలో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని దిగ్విజయ్ ఆదేశించారు. అన్ని స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా పునర్వ్యవస్థీకరణ జరగాలన్నారు. జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాల నేతలతో సమావేశమై డివిజన్లవారీగా బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని జీహెచ్‌ఎంసీ పార్టీ అధ్యక్షుడు దానం నాగేందర్‌కు సూచించారు.
 
కేసీఆర్‌ది కుటుంబ పాలన: దిగ్విజయ్
తెలంగాణలో కేసీఆర్ కుటుంబపాలన నడుస్తున్నదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ విమర్శించారు. మంగళవారం సమన్వయ భేటీ అనంతరం పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘చట్టాన్ని గౌరవించి కాపాడాల్సిన ముఖ్యమంత్రే స్వయంగా పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారు.

సీఎం స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం ఏమిటి? ప్రజా సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టి, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి టీఆర్‌ఎస్‌లోకి చేర్చుకుంటున్నారు. సీఎం చట్టాన్ని ఉల్లంఘిస్తూ రాజ్యాంగాన్ని అగౌరవపరుస్తున్నారు.’’ అంటూ విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌పై, ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీలో చేరిన నేతలు తప్పు చేస్తున్నట్టేనని, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను కేసీఆర్ మోసగిస్తున్నారని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్ చేయకపోవడం వల్ల విద్యార్థులు, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు లేకపోవడం వల్ల యువకులు కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. వీటిపై పోరాటానికి పార్టీ ముఖ్యనేతల నుంచి సలహాలను, అభిప్రాయాలను తీసుకుంటున్నామన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించినవారిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ప్రధాని మెదీ కూడా పాలనలో విఫలమయ్యారని దిగ్విజయ్‌సింగ్ విమర్శించారు. ప్రజా వ్యతిరేక ఆర్డినెన్సులు తేవడం తప్ప వారికి ఉపయోగపడే చర్యలేవీ తీసుకోవడం లేదన్నారు. కేంద్రం ఆర్డినెన్సులకు కేసీఆర్ ఎలా మద్దతిస్తున్నారని ప్రశ్నించారు.
 
బీజేపీకి సరైన అభ్యర్థులు లేకే కిరణ్‌బేడీ..
ఢిల్లీలో బీజేపీకి సరైన అభ్యర్థులు లేరని, అందుకే కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించిందని దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. తెలంగాణ పీసీసీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. కిరణ్‌బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించినంత మాత్రాన బీజేపీకి ఒనగూరే ప్రయోజనమేమీ లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement