హామీల అమలులో సర్కారు విఫలం
- ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తాం: దిగ్విజయ్ సింగ్
- టీకాంగ్రెస్ నేతలతో ఢిల్లీలో ప్రత్యేకంగా సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరి స్తామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ అన్నారు. బుధవారం ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించారు. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, సీఎల్పీనేత జానారెడ్డి, మండలి విపక్షనేత షబ్బీర్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క, ఎంపీ రేణుకా చౌదరి తదితరులు పాల్గొన్నారు.
సమావేశంలో ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌లో నెలకొన్న వర్గపోరుపై చర్చించినట్టు సమాచారం. జిల్లాకు చెందిన భట్టి, రేణుకా చౌదరిల మధ్య నెలకొన్న వర్గపోరుపై ఇరు పక్షాలకు దిగ్విజయ్ నచ్చజెప్పినట్లు తెలుస్తోంది. కొత్త జిలాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకానికి సంబంధించి కూడా చర్చించినట్టు సమాచారం. ఏకగ్రీవంగా జరిగే చోట అధ్యక్షుల నియామకాన్ని చేపట్టాలని, ఇద్దరి పేర్లు ప్రతిపాదనకు వస్తే తమకు పంపాలని దిగ్విజయ్ పార్టీ నేతలకు సూచించారు. సమావేశం అనంతరం దిగ్విజయ్ మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు లేదని, అందరం పార్టీ పటిష్టానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పారు.
ప్రజల అవసరాలే కాంగ్రెస్ ఎజెండా..
తెలంగాణలో ప్రజల అవసరాలే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అని, ఇచ్చిన హామీలు విస్మరించిన ప్రభుత్వాన్ని అసెంబ్లీలో నిలదీ స్తామని ఉత్తమ్, భట్టి అన్నారు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, ఇంటికో ఉద్యోగం వంటి హామీలపై ప్రభుత్వం విఫలమైందన్నారు. పెద్ద నోట్ల రద్దువల్ల కలుగుతున్న ఇబ్బందులు, దీని వల్ల రబీలో బ్యాంకులు రైతులకు రుణాలు ఇవ్వకపోవడంపై అసెంబ్లీలో గళమెత్తుతామని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీస్తాయన్న భయంతోనే మంత్రి హరీశ్‌రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని, సభను సజావుగా నడపాల్సిన మంత్రి.. ప్రతిపక్షాన్ని కడిగేస్తామని చెప్పడాన్ని చూస్తే ప్రభుత్వం భయపడుతున్నట్టు తెలుస్తోందని అన్నారు.
కేసీఆర్ దళితుల కాళ్లు కడగాలి
దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మాటతప్పిన సీఎం కేసీఆర్, దళితుల కాళ్లు కడగాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. ఎస్సీలకు మూడెకరాల భూమి ఇస్తానన్న హామీని విస్మరించారని, రిజర్వేషన్ల విషయంలో ఆదివాసులను, మైనార్టీలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. సీఎం అధికార నివాసం నిర్మాణానికి కాంట్రాక్టర్ దొరుకుతారు కానీ, డబుల్ బెడ్రూం ఇళ్ల పథకానికి కాంట్రాక్టర్ దొరకడం లేదా? అని ఆయన ప్రశ్నించారు.