సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది. మిత్రపక్షాలతో ఒకవైపు సీట్ల సర్దుబాటుపై చర్చిస్తూనే మరోవైపు సొంత పార్టీ నుంచి బరిలో నిలిచే అభ్యర్థుల ఖరారుపై కసరత్తు చేస్తోంది. రెండు రోజులుగా జాబితాను వడపోసిన రాష్ట్ర ఎన్నికల కమిటీ షార్ట్ లిస్ట్‌ను తయా రు చేసింది. ఈ జాబితాను ఏఐసీసీ నియమించిన స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి మరో రెండు రోజుల్లో పార్టీ అధినాయకత్వానికి నివేదించనుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శుల నేతృత్వంలో మన జిల్లాలోని ఓ రిసార్ట్‌లో భేటీ అయిన ఎన్నికల కమిటీ నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల జాబితాను పరిశీలించింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు దాదాపుగా లైన్‌క్లియర్ చేసిన కమిటీ.. వివాదాస్పద సెగ్మెంట్ల విషయంలో మాత్రం నిర్ణయాన్ని స్క్రీనింగ్ కమిటీకి వదిలేసింది. ఇదిలావుండగా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరు నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై ఏకాభిప్రాయం కుదిరింది.
టి.రామ్మోహన్‌రెడ్డి (పరిగి), సబితా ఇంద్రారెడ్డి (మహేశ్వరం), సుధీర్‌రెడ్డి (ఎల్‌బీనగర్), ఎన్.శ్రీధర్ (మల్కాజిగిరి), కూన శ్రీశైలంగౌడ్ (కుత్బుల్లాపూర్), భిక్షపతియాదవ్ (శేరిలింగంపల్లి) పేర్ల పరిశీలనకు పచ్చజెండా ఊపింది. కాగా, సీనియర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న వికారాబాద్, ఇబ్రహీంపట్నం విషయంలో మాత్రం ఎటూ తేల్చలేకపోయింది. వికారాబాద్‌లో మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, చంద్రశేఖర్ టికెట్ కోసం పోటీపడుతున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం సీటును మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కా>్యమ మల్లేశ్ ఆశిస్తున్నారు. సొంత పార్టీలోనే వైరివర్గాలుగా వ్యవహరిస్తూ టికెట్టు దక్కించుకునేందుకు సర్వశక్తులొడ్డుతున్నారు.
మహారాజ్‌లకు చుక్కెదురు!
తాండూరు రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన మహారాజ్ ఫ్యామిలీకి తొలిసారి చుక్కెదురైంది. ప్రతిసారి ఎన్నికల్లో ఆ కుటుంబానికి టికెట్ కట్టబెట్టిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి మాత్రం పేర్లను పరిశీలించలేదు. వాస్తవానికి ఇక్కడి నుంచి రమేశ్‌ను బరిలో దింపాలని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి నిర్ణయించారు. అందుకనుగుణంగా ఏడాది క్రితమే ఆయనను అభ్యర్థిగా ప్రకటించారు. అయితే, స్థానిక నాయకుల వ్యవహారశైలితో కినుక వహించిన రమేశ్.. బరి నుంచి తప్పుకుంటున్నట్లు పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు. దీంతో టికెట్ తమ కుటుంబానికే ఇవ్వాలని మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమారుడు నరేశ్, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు లాబీయింగ్ నెరిపినా పీసీసీ నాయకత్వం వారివైపు మొగ్గుచూపనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాండూరు అభ్యర్థుల జాబితాలో వీరికి చోటు కల్పించనట్లు కనిపిస్తోంది.
రాజేంద్రనగర్‌కు కాసాని
రాజేంద్రనగర్ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ పేరు తెరపైకి వచ్చింది. చేవెళ్ల ఎంపీ సీటును ఆశిస్తున్న ఆయన రెండు నెలల క్రితం జరిగిన రాహుల్‌గాంధీ సభకు భారీగా జనసమీకరణ చేశారు. తాజాగా ఆయన పేరును రాజేంద్రనగర్ అభ్యర్థుల జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి నుంచి మాజీ మంత్రి సబిత తనయుడు కార్తీక్ పోటీచేయాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ‘కుటుంబానికి ఒకే టికెట్’ నిబంధన ప్రతిబంధకంగా మారితే కాసానికి చాన్స్ వచ్చే అవకాశం లేకపొలేదనే ప్రచారం జరుగుతోంది.
రెండు చోట్ల చంద్రశేఖర్‌కు చోటు
ఈసారి బరిలో దిగి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ గతంలో ప్రాతినిథ్యం వహించిన వికా>రాబాద్ సీటును ఆశిస్తున్నారు. అయితే, ఇదే సీటు కావాలని మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌కు ఇక్కడ కాకపోతే చేవెళ్ల స్థానం నుంచి పరిగణనలోకి తీసుకోవాలని పీసీసీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలోనే వికారాబాద్, చేవెళ్ల అభ్యర్థుల జాబితాలో చంద్రశేఖర్ పేరును చేరుస్తూ స్క్రీనింగ్ కమిటీకి సిఫార్సు చేసింది.
మేడ్చల్, చేవెళ్ల, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, తాండూరు నుంచి ముగ్గురు, నలుగురు అభ్యర్థులను పేర్లను సూచిస్తూ ఎన్నికల కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న భక్తచరణ్‌దాస్ నేతృత్వంలోని స్క్రీనింగ్ కమిటీ సభ్యులు తుది జాబితా కూర్పుపై మల్లగుల్లాలు పడుతున్నారు. దీంతో ఆశావహులు అధిష్టానం స్థాయిలో పలుకుబడిని ఉపయోగించేందుకు హస్తినబాట పడుతున్నారు. మరోవైపు పాలమూరు నుంచి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో చేరిన కల్వకుర్తికి తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, షాద్‌నగర్‌కు మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి, కొడంగల్‌కు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డిల అభ్యర్థిత్వాలకు ఏకాభిప్రాయం వ్యక్తమైంది.
Comments
Please login to add a commentAdd a comment