
'సామాన్యులకు ఇబ్బందులు లేకుండా చూడాలి'
-ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి
మహబూబ్‌నగర్ జిల్లా : బ్యాంకుల్లో సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చూడాలని కల్వకుర్తి ఎమ్మెల్యే చల్లా వంశీచంద్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.1000, 500 నోట్లను రద్దు చేయడంతో బ్యాంకుల వద్ద సామాన్య ప్రజానీకం పడుతున్న ఇబ్బందులను, కష్టాలను పరిశీలించేందుకు, ఆదివారం కడ్తాల్ ఆంధ్రాబ్యాంకును ఎమ్మెల్యే సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన బ్యాంకులో ఉన్న ప్రజల సమస‍్యలను అడిగి తెలుసుకున్నారు. గంటల తరబడి లైన్లలో నిలబడవలసి వస్తుందని, కేవలం రూ.2వేల వరకే నగదు మార్పిడి చేస్తున్నారని వారు వాపోయారు. ఆదివారం బ్యాంకులో నగదు నిల్వ అయిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్నారని, చాలామంది తిరిగి ఇళ్లకు వెళ్లిపోవాల్సి వచ్చిందని ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై ఎమ్మెల్యే బ్యాంకు మేనేజర్తో చర్చించారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని వంశీచంద్‌రెడ్డి కోరారు.