
సాక్షి, హైదరాబాద్ : టీఆర్‌ఎస్ పార్టీ ఓ వైపు పార్లమెంట్‌లో జనాభా ప్రాతిపదికన విద్య, వైద్యంలో రిజర్వేషన్‌లు కల్పించాలని ఆందోళన చేస్తూ.. మరో వైపు కేజీ టూ పీజీ ఉచిత నిర్భంధ విద్య అమలు చేస్తామని చెప్పి పెట్టుబడి వర్గాలకు కొమ్ముకాస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. గరువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. బడుగు బలహీన వర్గాలతో పాటు బీసీలకు ఎంత రిజర్వేషన్లు ఇస్తారో చెప్పకుండా, రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్‌లు కల్పించకుండా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లు ఆమోదించుకున్నారని ఆరోపించారు.
ప్రతి పక్షాలు బిల్లు వ్యతిరేకించినా.. అమరుల త్యాగం ద్వారా వచ్చిన తెలంగాణలో ప్రజాస్వామ్య హక్కు కాలరాస్తు ఈ బిల్లు ఆమోదించుకున్నారని అన్నారు. ప్రధాన ప్రతిపక్షాన్ని బయటకు పంపి ఏకపక్షంగా రిజర్వేషన్లు, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వకుండా చేశారన్నారు. అన్నింటిపైనా స్పష్టత వచ్చే వరకు బిల్లును ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment