ప్రకటనలతో కాలం గడుపుతున్నారు: జీవన్‌రెడ్డి
హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించలేని కేసీఆర్ ప్రభుత్వం, నిందను కేంద్రంపై వేసి, చేతులెత్తేసిందని కాంగ్రెస్ నాయకుడు ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఖరీఫ్ నుండే రైతులకు ఎకరాకు రూ.4 వేలు ఇవ్వవలసి ఉందన్నారు. రైతు సమస్యలను దృష్టి మళ్లించడానికే సమగ్ర భూ సర్వేను సీఎం తెరమీదకు తీసుకొచ్చారని, మండలానికి ఒక్క సర్వేయర్ కూడా దిక్కు లేదని అన్నారు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్‌ఎల్‌బీసీ సమావేశానికి రాని ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరే అని ఎద్దేవా చేశారు. ఖరీఫ్, రబీలకు సంబంధించి జిల్లా స్థాయి బ్యాంకర్స్ సమావేశాలు కూడా ఇంతవరకు నిర్వహించలేదన్నారు. పెట్టుబడి రాయితీ కాదు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రకటనలతోనే సీఎం కాలం గడుపుతున్నారని, రుణమాఫీ ప్రక్రియ ఇంతవరకు పూర్తి కాలేదని మండిపడ్డారు. మద్దతు ధరపై బోనస్ ఎందుకు ప్రకటించడంలేదని ఆయన ప్రశ్నించారు. సమగ్ర భూ సర్వే కూడా మరో సమగ్ర కుటుంబ సర్వేలాగే అవుతుందని అనుమానాలు వ్యక్తం చేశారు. వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్ ఇచ్చి రైతులకు అండగా ఉండాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.