కేసీఆర్‌కు ముక్కు కూడా మిగలదు: జీవన్ రెడ్డి
జగిత్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణకు పట్టిన శని అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఆయనకు చట్టాలపై అవగాహన ఉందో లేదో తెలియదని, న్యాయ వ్యవస్థను కించపరుస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘంలో అంతర్గత విభేదాలతో సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలపై కోర్టుకు వెళ్లి కాంగ్రెస్‌ను బాధ్యులను చేస్తున్నారని అన్నారు. ఆయనేమీ రాజ్యాంగానికి అతీతుడు కాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం ఇప్పటివరకు కేంద్రానికి డీపీఆర్ సమర్పించలేదని విమర్శించారు.
కేసీఆర్ అబద్ధాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారని.. చెప్పే అబద్ధాలకు, చేసే మోసాలకు ముక్కు నేలకు రాయాల్సి వస్తే కేసీఆర్‌కు ముక్కు కూడా మిగలదని ఎద్దేవా చేశారు. ప్రాణహిత- చేవెళ్ల తో తెలంగాణ సస్యశ్యామలం అయ్యే అవకాశం ఉన్నా, రీడిజైన్ పేరుతో కాలయాపన చేస్తున్నారని, ప్రాజెక్టుల నిర్మాణ జాప్యానికి కేసీఆర్ కారణమని ఆరోపించారు. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విధి లేని పరిస్థితుల్లోనే కరీంనగర్ మెడికల్ కాలేజ్ కోసం ఆమరణ దీక్షకు దిగుతున్నారని చెప్పారు. ఈ రాష్ట్రంలో పౌరహక్కులకు విలువ లేదన్నారు. అహంకారమే కేసీఆర్‌ను గద్దె దించుతుందని జీవన్‌రెడ్డి తెలిపారు.