గుడి పైలమే..
రామప్ప వద్ద దేవాదుల అలైన్‌మెంట్ మార్పు..
సొరంగం స్థానంలో పైపులైన్ నిర్మాణం
- రెండు కిలోమీటర్ల మేర ఏర్పాటు
- ఎన్‌జీఆర్‌ఐ, సీడబ్ల్యూసీ సూచనలతో ప్లాన్ రూపకల్పన
- ప్రభుత్వానికి నివేదిక అందజేసిన ప్రాజెక్టు ఇంజినీర్లు
హన్మకొండ : దేవాదుల మూడో దశలో భాగంగా రామప్ప ఆలయం వద్ద నిర్మించ తలపెట్టిన సొరంగం అలైన్‌మెంట్ మారింది. సొరంగం స్థానంలో పైపులైన్ నిర్మించనున్నారు. వెంకటాపురం మండలం పాలంపేటలోని చారిత్రక రామప్ప దేవాలయానికి ముప్పు వాటిల్లుతుందనే కారణంతో రెండేళ్ల క్రితం అక్కడ సొరంగం తవ్వకం పనులు నిలిపివేశారు. దేవాదుల మూడో దశలోని రెండో ప్యాకేజీలో భాగంగా భూపాలపల్లి మండలం భీంఘన్‌పూర్ నుంచి వెంకటాపురం మండలంలోని రామప్ప వరకు రూ.530.70 కోట్లతో 21 కిలోమీటర్ల సొరంగం, మరో 4 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ తవ్వేందుకు 2009 జనవరిలో టెండర్లు పిలవగా... ఫిబ్రవరి 28న అగ్రిమెంట్ ప్రక్రియ పూర్తరుంది.
మూడేళ్ల గడువుతో 2012 ఫిబ్రవరి 27 వరకు పనులు పూర్తి చేయాలని ఒప్పందం కుదిరింది. కానీ... ఇప్పటివరకు భీంఘన్‌పూర్ నుంచి మధ్య మధ్యలో మొత్తం మూడు కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్... రెండు కిలోమీటర్ల సొరంగం మాత్రమే తవ్వారు. ఈ 21 కిలోమీటర్ల పరిధిలో సొరంగం తవ్వకాల కోసం ఐదు అడిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. గొల్లబుద్దారం, గండి కామారం, రామకృష్ణాపూర్, నల్లకుంట, పాలంపేట వద్ద అడిట్ పాయింట్లు గుర్తించారు. వీటిలో గొల్ల బుద్దారం, గండికామారం, రామకృష్ణాపూర్ వద్ద అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. వెంకటాపురం మండలంలోని నల్లకుంట, పాలంపేటలో సొరంగం తవ్వకం పనులు ప్రారంభమయ్యూరు.
పాలంపేట నుంచి రామప్ప ఆలయూనికి 2 కి.మీల దూరం ఉంటుంది. పాలంపేట అడిట్ పాయింట్ నుంచి 1.86 కి.మీల మేర సొరంగం తవ్వకం పనులు చేశారు. ఈ క్రమంలో పేలుళ్లతో ఆలయానికి ప్రమాదం ఉందని... సొరంగం పక్కనే 0.89 కిలోమీటర్ల దూరంలో సింగరేణి భూగర్భ గనులు అడ్డురావడం వంటి కారణాలతో పాలంపేట వద్ద పనులు రెండేళ్ల క్రితం ఆగిపోయూరు. ఆ తర్వాత ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు సంయుక్తంగా పలు దఫాలుగా అక్కడ పరిశీలనలు జరిపారు. దీంతో అప్పటి కలెక్టర్ రాహుల్‌బొజ్జా ఇక్కడ పరిశీలన చేయాలని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థను (ఎన్‌జీఆర్‌ఐ) కోరగా.. వారు ఇక్కడ పరిశీలన జరిపి బాంబు పేలుళ్ల స్థాయి తగ్గించాలని సూచించింది.
అయితే ఎన్‌జీఆర్‌ఐ సూచించిన స్థాయిలో పేలుళ్లు జరిపితే... తట్టెడు మట్టి కూడా బయటకు రాదని దేవాదుల ఇంజినీర్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత నీటి పారుదల శాఖ సూచనలతో ఎన్‌జీఆర్‌ఐ, సీడబ్ల్యూసీ ఇంజినీర్లు పూర్తిస్థాయిలో పరిశీలన చేశారు. పలు సూచనలు చేసినప్పటికీ సాధ్యం కాకపోవడంతోపాటు పనులు చేస్తున్న కంపెనీ కూడా కష్టమని చెప్పడంతో భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు సొరంగం అలైన్‌మెంట్ మార్పునకు దేవాదుల ఇంజినీర్లు ప్లాన్ వేశారు. ఎన్‌జీఆర్‌ఐ నివేదికలు, కేంద్ర జల వనరుల సంఘం ఇంజినీర్ల సూచనలు... ఇలా పలు రిపోర్టుల ఆధారంగా సొరంగానికి బదులుగా పైపులైన్ నిర్మాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలని సర్కారుకు నివేదించారు.
పైపులైన్ నిర్మాణంతో అదనపు భారం ఉండదని, అటవీ శాఖ నుంచి అనుమతులు వచ్చాయని, భూ సేకరణ పూర్తరుునందున పనులు త్వరగా చేపట్టవచ్చని నివేదికల్లో పొందుపరిచారు. అంతేకాదు... మొదటి, రెండో దశల పైపులైన్ నిర్మాణం పూర్తి చేసి ఉన్నామని, వాటి పక్క నుంచి మూడో దశ పైపులైన్ వేయడం తేలికగా ఉంటుందని వివరించారు. ప్రస్తుతం సొరంగం పనులకు ఇంకా భూ సేకరణ చేయాల్సి ఉంటుందని... పైపులైన్ నిర్మాణానికి అవసరం లేదని నివేదికల్లో పేర్కొన్నారు. భీంఘన్‌పూర్ నుంచి రామప్ప వరకు 21 కిలోమీటర్లలో రామప్ప వద్ద కేవలం 2 కిలోమీటర్ల మేరకు పైపులైన్ నిర్మాణానికి అనువుగా ఉందని... అక్కడ నుంచి ధర్మసాగర్ వరకు సొరంగం పనులు చేసేందుకు అనువుగా ఉందని నివేదికల్లో జోడించారు.
దేవాదుల మూడో దశ మొదటి ప్యాకేజీలో ఇన్‌టేక్‌వెల్ నుంచి భీంఘన్‌పూర్ వరకు 39 కిలోమీటర్ల దూరంలో వేస్తున్న పైపులైన్ తరహాలోనే... మూడో దశలోని ఈ రెండో ప్యాకేజీకి కూడా పైపులైన్ నిర్మాణం చేసేందుకు అనుమతి ఇవ్వాలని వారు కోరారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సాగునీటి ప్రాజెక్ట్ సమీక్ష సమావేశంలో దేవాదుల మూడో దశ నిర్మాణ పనులపై ఆరా తీసింది. మరోమారు పరిశీలన జరిపి రామప్ప వద్ద సొరం గం పనుల అలైన్‌మెంట్ మార్పు, పైపులైన్ డిజైన్లతో నివేదిక పంపించాలని దేవాదుల ఇంజినీర్లను ఆదేశించింది. దీంతో వారు రెండు రోజుల క్రితం ప్రభుత్వానికి నివేదికలు, డిజైన్లను పంపించారు.