
జాతీయ విత్తన ధ్రువీకరణ సదస్సులో మాట్లాడుతున్న వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్. చిత్రంలో పార్థసారథి తదితరులు
సాక్షి, హైదరాబాద్: విత్తన భాండాగారం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి కేంద్ర ప్రభుత్వం సహకారం ఇస్తుందని కేంద్ర వ్యవసాయశాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ బి.రాజేందర్ హామీ ఇచ్చారు. శనివారం ఇక్కడ జరిగిన జాతీయ విత్తన ధ్రువీకరణ సదస్సులో ఆయన మాట్లాడారు. 17 రాష్ట్రాల విత్తన ధ్రువీకరణ డైరెక్టర్లు, ఇతర అధికారులు హాజరయ్యారు. రాజేందర్ మాట్లాడుతూ, ఈ జాతీయ సదస్సు చర్చించే కీలకాంశాలను తాము పరిశీలిస్తామని, అందుకనుగుణంగా విత్తన చట్టానికి, మాన్యువల్‌లో మార్పులు, చేర్పులు చేస్తామని చెప్పారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేయాలంటే అందుకు విత్తన నాణ్యతే కీలకమని, అందుకోసం విత్తన ధ్రువీకరణలో ప్రమాణాలు పెంచాలన్నారు.
విత్తనోత్పత్తి ద్వారా రైతులకు సాధారణ పంటలకంటే ఐదు నుంచి పది రెట్లు అధికంగా ఆదాయం సమకూరుతుందన్నారు. బీజీ–3 పత్తి విత్తనంపై కేంద్రం సమాలోచనలు చేస్తుందని తెలిపారు. తెలంగాణ వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి మాట్లాడుతూ, ఈ ఏడాది రబీలో 6 వేల ఎకరాల్లో విత్తన ధ్రువీకరణ కింద రిజిస్ట్రేషన్ చేశామన్నారు. తద్వారా 50 వేల క్వింటాళ్ల వరకు ధ్రువీకరించిన విత్తనోత్పత్తి జరగనుందన్నారు. సేంద్రియ ధ్రువీకరణ సంస్థలను ప్రభుత్వపరంగా అన్ని రాష్ట్రాల్లో ప్రారంభిం చాలని సూచించారు. తమిళనాడు రాష్ట్రం ఫౌండేషన్ స్టేజ్–2 విత్తనాన్ని 90 శాతం తెలంగాణ నుంచే తీసుకెళ్తుందన్నారు. వచ్చే జూన్ నాటికి హైదరాబాద్‌లో ఇస్టా ల్యాబ్ అందుబాటులోకి రానుందని వివరించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్ మాట్లాడుతూ రసాయన ఎరువులతో పంటలు పండించడం వల్ల జనం రోగాల బారిన పడుతున్నారన్నారు. జాతీయ విత్తన సంస్థ ఎండి. వి.కె.గౌర్, తెలంగాణ విత్తన సేంద్రియ ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు తదితరులు సదస్సులో పాల్గొన్నారు.