జిల్లా కేంద్రం హౌసింగ్ బోర్డు కాలనీలో ఆదివారం తెల్లవారుజామున పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు కాలనీ మొత్తాన్ని జల్లెడపట్టారు. సరైన ధ్రువపత్రాలు లేని 15 వాహనాలను సీజ్ చేశారు. పాతబస్తీలో అనుమానితుల కదలికలు ఉన్నట్టు సమాచారం అందడంతోనే నిర్బంధ తనిఖీలు నిర్వహించినట్టు ఖాకీలు పేర్కొన్నారు.
నల్లగొండ క్రైం : పట్టణంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో పోలీసులు ఆదివారం ఉదయం 5గంటల ప్రాంతంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏఎస్పీ పద్మనాభరెడ్డి, డీఎస్పీ సుధాకర్ ఆధ్వర్యంలో 120 మంది పోలీసులు హౌసింగ్‌బోర్డు ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని జల్లెడ పట్టడంతో ప్రజలు ఒక్కసారిగా ఏం జరిగిందోనని ఆందోళన చెందారు. గంజాయి అమ్మకాలు, శివారు ప్రాంతాల్లో పేకాటలాంటి అసాంఘిక కార్యక్రమాలు, అనుమానిత వ్యక్తుల కదలికలను ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు.
ఆధారాలు సక్రమంగా లేని 15 వాహనాలు సీజ్ చేశారు. పలువురు అనుమానిత వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించి సాయంత్రం వదిలేశారు. అనుమానిత నివాసాలను కూడా తనిఖీలు చేసి వారి దగ్గర ఉన్న గుర్తింపు కార్డుల ఆధారంగా వదిలేశారు. అనుమానిత వ్యక్తులు, గుర్తుతెలియని వారికి ఇళ్లు కిరాయికి ఇవ్వొద్దని, అనుమానిత వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని సూచించారు. సీజ్ చేసిన వాహనాల ఆధారాలను చూపించి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో సీఐలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఆదిరెడ్డి, రమేష్, అనురాధ, ఎస్‌ఐలు మోతిరామ్, హన్మంతరెడ్డి, రామలింగదుర్గాప్రసాద్, హరిబాబు, శేఖర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment