
సాక్షి, హైదరాబాద్: పీఎఫ్(భవిష్యనిధి) ఖాతా నుంచి నగదు ఉపసంహరించుకునేందుకు దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేందుకు చివరగా పీఎఫ్ విత్‌డ్రా వైపు మొగ్గు చూపుతుండటంతో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరుగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించడంతో దాదాపు అన్ని రకాల పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, వాణిజ్య సముదాయాలు మూతబడ్డాయి. దీంతో ఆయా యాజమాన్యాలు ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని స్థితి తలెత్తడం... కొన్ని కంపెనీలు వేతనాల్లో సగం మాత్రమే ఇవ్వడంతో సగటు ఉద్యోగికి ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. ఈ పరిస్థితిని అధిగమిం చేందుకు ఉద్యోగి పీఎఫ్ ఖాతా నుంచి మూడు నెలల వేతనానికి సమానమైన నగదు ఉపసంహరించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో ఉద్యోగులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు పెట్టుకుంటున్నారు.
57 వేలు దాటిన అర్జీలు...
కేంద్రం విధించిన లాక్‌డౌన్‌తో క్షేత్రస్థాయిలో ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఇందులో భాగంగా పీఎఫ్ ఖాతాదారులు వారి పీఎఫ్ నుంచి మూడు నెలల వేతనానికి సరిపడా నిధులను విత్‌డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించింది. దీన్ని గత నెలలో కేంద్రం ప్రకటించగా... ఇప్పటివరకు రాష్ట్రంలో దాదాపు 57 వేల మంది అర్జీలు పెట్టుకున్నారు. వీటిని మూడు రోజుల్లో పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేయడంతో... ఆదిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆర్‌పీఎఫ్‌సీ (రీజినల్ ప్రావిడెంట్ కమిషనర్ ) కార్యాలయంలో ఉద్యోగులకు వీటి పరిష్కార బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో ఉద్యోగులు పరిమిత సంఖ్యలో వస్తుండటంతో రోజువారీ హాజరును బట్టి వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ప్రస్తుతం పీఎఫ్ విత్‌డ్రా దరఖాస్తులన్నీ ఆన్‌లైన్ పద్దతిలోనే వస్తుండటంతో వాటిని వేగంగా తెరిచి పరిష్కరించేందుకు ఆర్‌పీఎఫ్‌సీ కార్యాలయంలో ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. ఒక దరఖాస్తును గరి ష్టంగా మూడు పనిదినాల్లో పరిష్కరించేలా సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 33,500 దరఖాస్తులు పరిష్కరించినట్లు సమాచారం
భారీగా పెరిగే అవకాశం...
పీఎఫ్ విత్‌డ్రా దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ నెలంతా లాక్‌డౌన్‌తోనే గడుస్తుంది. గత నెలలో పది రోజుల పాటు లాక్‌డౌన్ ఉన్నప్పటికీ మెజార్టీ కంపెనీలు పూర్తి వేతనాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం లాక్‌డౌన్‌తో చాలా కంపెనీల్లో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. దీంతో ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. దీంతో ఉద్యోగి అవసరాలకు పీఎఫ్ నిధులే శరణ్యమనే పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈనెల 20 తర్వాత దరఖాస్తుల సంఖ్య భారీగా పెరగనుంది. వచ్చే నెలలో ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉందని ఆర్‌పీఎఫ్‌సీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment