స్ప్రేతో కరోనాను తరిమేస్తామంటున్న పాలమూరు మున్సిపల్ సిబ్బంది
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా గండం గట్టెక్కుతోంది. వారం రోజుల క్రితం వరకు మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కలవరపర్చిన కరోనా మహమ్మారి ఇప్పుడు ఆయా జిల్లాలో తగ్గుముఖం పడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలు.. అధికారుల చర్యలు.. ప్రజాప్రతినిధుల అవగాహన వెరసి ఆయా జిల్లాల్లో లాక్‌డౌన్ పటిష్టంగా అమలవుతోంది. ఫలితంగా.. లోకల్ ట్రాన్స్‌మిషన్‌కు ఆస్కారం లేదు.
సాక్షి, మహబూబ్‌నగర్: కరోనా వైరస్ లక్షణాలు, చర్యలపై ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రచారం సత్ఫలితాలిస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి వైద్యులను సంప్రదిస్తున్నారు. తమ ఇళ్లకు సర్వే కోసం విచ్చేస్తున్న ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లకు మద్దతు తెలుపుతున్నారు. దీంతో కరోనా లక్షణాలు ఉన్న వారి గొంతు, ముక్కు నుంచి నమూనాలు తీసి నిర్ధారణ కోసం పంపిస్తున్నారు. ఇదిలాఉండగా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కలకలం రేపిన ఢిల్లీ–మర్కస్ భయమూ క్రమంగా తొలిగిపోతోంది. ఢిల్లీ ధార్మిక సభలో ఉమ్మడి జిల్లా నుంచి పాల్గొన్న 127 మందిలో ఒకరు గత నెల 28న కరోనా పాజిటివ్‌తో చనిపోయారు. ఈ సంఘటనతో ప్రజలు, అధికార యంత్రాంగం ఉలికిపడింది. అప్పట్నుంచీ వరుసగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వచ్చాయి. మూడు రోజుల క్రితం వరకు ఈ పరంపర కొనసాగింది.
అనంతరం పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడం.. కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారు ప్రస్తుతం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ముఖ్యంగా మొత్తం నమోదైన 33 పాజిటివ్ కేసుల్లో 30 మంది ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు, వారి సన్నిహితులే ఉన్నారు. దీంతో అప్రమత్తమైన అధికారులు చేపట్టిన ప్రత్యేక చర్యలు.. అమలు చేసిన కఠిన నిబంధనలు ఉత్తమ ఫలితాలిచ్చాయి. ఢిల్లీ కేసులు నమోదైన 18 ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కాగా రానున్న 15 రోజుల వరకు లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేయడం ద్వారా కరోనాకు కళ్లెం వేస్తామని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ వెంకట్రావ్ చెప్పారు.
- నాగర్‌కర్నూల్ జిల్లాలో గత నెల 31న, ఈనెల 3న ఒక్కో పాజిటివ్ కేసు నమోదైంది. ఈ రెండూ ఢిల్లీకి Ððవెళ్లి వచ్చిన వారివి కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితులను హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. వీరిలో కరోనా లక్షణాలు ఉన్న 87 మంది నుంచి తీసిన నమూనాలను నిర్ధారణ కోసం హైదరాబాద్‌కు పంపగా అందరికీ నెగిటివ్ వచ్చింది.
- మహబూబ్‌నగర్ జిల్లాలో గత నెల 31న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా.. ఈనెల 8న 11కు చేరింది. ఆ తర్వాత కేసులేమీ నమోదు కాలేదు. ఇందులోనే ఎనిమిది మంది ఢిల్లీకి వెళ్లిన వారు, వారితో సన్నిహితంగా ఉన్న వారు ఉండటంతో అధికారులు అప్రమత్తమై పటిష్ట చర్యలు తీసుకున్నారు. వారి బంధువులతో పాటు పాజిటివ్ కేసులొచ్చిన వారి ప్రాంతాల్లోని ప్రతి ఇంటిలో సర్వే నిర్వహించి వారిని క్వారంటైన్ చేశారు. ప్రస్తుతం జిల్లాలో ఆరు ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా ప్రకటించి గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కేసులేవీ లేకపోవడంతో అధికారులు రానున్న 15రోజుల్లో లాక్‌డౌన్‌ను అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్నారు. అంతవరకు కేసులేవీ రాకపోతే గండం గట్టెక్కినట్టేనని ఓ జిల్లా అధికారి తెలిపారు.
- మూడు రోజుల క్రితం వరకు జోగుళాంబ గద్వాల జిల్లాను కలవరపర్చిన కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పట్టింది. జిల్లాలో మొత్తం 20 కేసులు నమోదు కావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమై.. జాగ్రత్త చర్యలు ముమ్మరం చేశారు. జనం అనవసరంగా బయటికి రాకుండా లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేశారు. కేసులు నమోదైన ప్రాంతాలను 11 హాట్‌స్పాట్లుగా గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు సైతం వారి ఇళ్లకే పంపి ఎక్కడికక్కడ కట్టడి చేశారు. గద్వాల పట్టణంలో 11 మందికి కరోనా పాజిటివ్ రావడం.. వారిలో ఒకరు చనిపోవడంతో ప్రభావిత ప్రాంతాల దారులన్నీ మూసేశారు. అయిజ, శాంతినగర్‌లో నాలుగు చొప్పున, రాజోళిలో ఇద్దరికి జిల్లాలో మొత్తం 21 మందికి పాజిటివ్ రావడంతో ఆయా ప్రాంతాలను హాట్‌స్పాట్లుగా గుర్తించి జనం బయటికి రాకుండా కట్టడి చేశారు.
అందరి కృషి వల్లే: మంత్రి
అందరి కృషి వల్లే పాలమూరు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగామని రాష్ట్ర క్రీడలు, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ వైరస్ నియంత్రణకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్న కలెక్టర్ మొదలుకొని అటెండర్ వరకు అందరినీ అభినందించారు. అనుమానిత కేసులు సైతం నెగిటివ్‌గానే వచ్చాయన్నారు. ఢిల్లీ–మర్కజ్ బాధితులకు సంబంధించి 61 నెగిటివ్ ఫలితాలు వచ్చినా మరోసారి పరీక్షలు నిర్వహించి వారందరినీ ఇళ్లకు పంపిస్తామన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లా అధికారులు, యంత్రాంగం మరో వారం, పది రోజులు కష్టపడి పనిచేస్తే కరోనా నుంచి అందరూ బయటపడే అవకాశం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment