
సాక్షి, (కొత్తగూడెం): డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ప్రజలకు ప్రభుత్వం సూచించిన మెడిసిన్ ఇవ్వకూడదని కలెక్టర్ డాక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. మెడికల్ షాపులపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించినట్లు ఆదివారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దగ్గు, జ్వరం, జలుబుతో మెడికల్ షాప్‌నకు వచ్చే ప్రజలకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించొద్దని తెలిపారు. వీటి వలన స్వల్పంగా ఉపశమనం ఉండడంతో కరోనా పరీక్షలకు కొందరు ముందుకు రావడం లేదని, అందుకే ప్రభుత్వం మెడికల్ షాపులపై ఆంక్షలు విధించినట్లు వివరించారు. దీంతో జలుబు, జ్వరం ఉన్నా వైద్యుల వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నారు.
తుపాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఎం.వి.రెడ్డి ఒక ప్రకటనలో సూచించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఈ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో కూడిన తుపాను సంభవించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని పేర్కొన్నారు. ధాన్యం, మొక్కజొన్న రాశులు తడవకుండా రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అధికారులు కూడా అవసరమైన జాగ్రత్తలను తీసుకోవాలని కలెక్టర్ ఎంవీ రెడ్డి సూచించారు.