సాక్షి,హైదరాబాద్: గుంపులుగా వస్తే నేరం.. పాటించాలి భౌతిక దూరం.. ఒక్కరికి ఓకే... లేదంటే చిక్కే... ఇవీ పోలీసుస్టేషన్లలో అమలు కానున్న కఠిన నిబంధనలు. మాస్కు లేకుండా వస్తే రిస్కే. ఫిర్యాదు నిమిత్తం వచ్చేవారిలో ఇకపై ఒక్కరినే ఠాణాలోకి అనుమతించనున్నారు. రాష్ట్రంలో రోజురోజులకూ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఎవరినీ వదలడంలేదు. ఇప్పటికే దాదాపు 300 సిబ్బంది కరోనా బారిన పడ్డారు. అందుకే పోలీసు శాఖ కూడా అప్రమత్తమైంది. ఇకపై స్టేషన్‌లోకి ఎవరైనా ఇష్టానుసారంగా వస్తే కేసులు పెట్టాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. లాక్‌డౌన్ నిబంధనలు సడలించాక రాష్ట్రంలో నేరాలు, గొడవలు పెరిగాయి. దీంతో పోలీసుస్టేషన్‌కి వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ఇక్కడికి వచ్చేవారిలో చాలామంది భౌతిక దూరం పాటించడం లేదు. కనీసం మాస్కు కూడా ధరించడం లేదు. వారిలో ఎవరైనా లక్షణాలు బయటికి కనిపించని కరోనా పేషెంట్ ఉంటే, వారి ద్వారా పోలీసులకు కూడా కోవిడ్ సోకే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో ఎవరైనా ఠాణాలోకి ప్రవేశించే ముందు విధిగా మాస్కు ధరించాలని, లేకుంటే రూ.వెయ్యి జరిమానా విధించాలని నిర్ణయించారు. భౌతిక దూరం పాటించకుండా గుంపులు గుంపులుగా పోలీసుస్టేషన్‌లోకి వస్తే విపత్తు నిర్వహణ చట్టం 51(బి) కింద కేసులు కూడా నమోదు చేస్తారు. ఫిర్యాదుదారులు ఠాణాలోకి ప్రవేశించేముందు చేతులను అక్కడే శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment