వనపర్తి: మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం పెద్దగూడెం గ్రామంలో మంగళవారం ఉదయం ఓ ఇంటి గోడ కూలడంతో దంపతులు మృతిచెందారు. ఇంటి మరమ్మతులు జరుగుతున్నందున చెన్నమ్మ(50), బక్కన్న(60) దంపతులు సోమవారం రాత్రి ఇంటి ముందు స్థలంలో నిద్రపోయారు. చలి ఎక్కువగా ఉండడంతో తెల్లవారుజామున ఇంట్లోకి వెళ్లి పడుకున్నారు. అయితే తెల్లవారుజామున హఠాత్తుగా గోడ కాలడంతో చెన్నమ్మ అక్కడికక్కడే మృతిచెందింది.
తీవ్రంగా గాయపడిన బక్కన్నను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. ఆ ఇంట్లో వీరిద్దరే ఉంటున్నారు. వారి పిల్లలు వేరే గ్రామంలో కాపురం ఉంటున్నారు. వారికి గ్రామస్తులు సమాచారం అందించారు. ఒక్కసారిగా దంపతులిద్దరూ మృతిచెందడంతో స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి.