మధిర: అరుణ పతాకాలు.. రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతుతో పట్టణం ఎరుపెక్కింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా మధిరలో సీపీఎం జిల్లా 19వ మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా భారీ ప్రదర్శన నిర్వహించారు. బి.వి.రాఘవులు, తమ్మినేని వీరభద్రం తదితర నాయకులు ముందు నడవగా కార్యకర్తలు వారిని అనుసరిస్తూ కొనసాగిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. స్థానిక రెడ్డి గార్డెన్స్ వద్ద ప్రారంభమైన ఈ కవాతు వైఎస్‌ఆర్ చౌరస్తా, రైల్వే ఓవర్‌బ్రిడ్జి, సీపీఎం కార్యాలయం, అంబేద్కర్ సెంటర్ మీదుగా సభా ప్రాంగణమైన టీవీఎం పాఠశాల వద్దకు చేరుకుంది.
ప్రజానాట్యమండలి కళాకారుల ప్రదర్శనలు, బుచ్చిరెడ్డిపాలెం చిన్నారుల కోలాటాలు, గిరిజన సంప్రదాయ కొమ్ము నృత్యాలు అలరించాయి. అనంతరం జరిగిన బహిరంగసభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యహితంగా, కార్యకర్తల ఆలోచనల మేరకు పనిచేసే పార్టీ సీపీఎం ఒక్కటే అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తమకెంతో మేలు జరుగుతుందని తెలంగాణ ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారని, అయితే వారి ఆశలు అడియాశలే అవుతున్నాయని అన్నారు. అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నారు. వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్య రంగాలు బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందినట్టని అన్నారు.
తెలంగాణలో 6 నెలల్లో 680 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, దీనిని బట్టి వ్యవసాయ రంగానికి ప్రభుత్వ ప్రోత్సాహం ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. ఇంత మంది రైతులు మరణించినా సీఎం కానీ, ఒక మంత్రి కానీ పరామర్శించిన దాఖలాలు లేవని విమర్శించారు. కనీసం బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పాలనే మానవత్వం కూడా ప్రభుత్వానికి లేదని ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పిట్టల దొరలా మాట్లాడుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరెంటు లేక రైతులు, పరిశ్రమల వారు ఇబ్బంది పడుతుంటే కేసీఆర్ సింగపూర్ పర్యటన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పి.. ఉన్న పాఠశాలలనే తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. 1956 స్థానికత పేరుతో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం సమంజసం కాదన్నారు.
తెలంగాణలో పుట్టిన ప్రతి ఒక్కరికీ, ఇక్కడ స్థిరపడిన వారికి సంక్షేమ పథకాలు అందించాల్సిందేనని స్పష్టం చేశారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. కోట్లాది రూపాయలు వెచ్చించి భూములు పంపిణీ చేయడమే కాకుండా, భూస్వాముల కోరలు పీకి వారి వద్ద ఉన్న భూమిని కూడా సేకరించి దళితులకు పంపిణీ చేయాలన్నారు. ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే 2019 ఎన్నికల్లో సీపీఎంను గెలిపించాల్సిన అవసరం ఉందన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్.వీరయ్య, సారంపల్లి మల్లారెడ్డి, భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య తదితరులు ప్రసంగించారు. సీపీఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన మహాసభలో డివిజన్ కార్యదర్శి లింగాల కమల్‌రాజ్, నాయకులు బుగ్గవీటి సరళ, హైమావతి, సోమయ్య, బి.వెంకట్, సుబ్బారావు, సామినేని రామారావు, బండారు రవికుమార్, కాసాని ఐలయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, బండి రమేష్ పాల్గొన్నారు.