‘స్కిల్డ్‌’లో గ్రేటర్‌ నం.3 | Creation Of Skilled Jobs Hyderabad Got Third Rank | Sakshi
Sakshi News home page

‘స్కిల్డ్‌’లో గ్రేటర్‌ నం.3

Published Thu, Mar 5 2020 1:59 AM | Last Updated on Thu, Mar 5 2020 1:59 AM

Creation Of Skilled Jobs Hyderabad Got Third Rank - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నైపుణ్యం కలిగిన ఉద్యోగులను ఆకర్షించటంలో దేశంలో మొదటి మూడు నగరాల్లో హైదరాబాద్‌ స్థానం దక్కించుకుంది. ఈ విషయంలో దేశ రాజధాని ఢిల్లీ తొలిస్థానంలో నిలిచింది. ద్వితీయస్థానంలో గ్రీన్‌సిటీ బెంగళూరు నిలిచింది. నైపుణ్యం గల ఉద్యోగులకు విస్తృత అవకాశాలు కల్పిస్తున్న నగరాలపై అతిపెద్ద ’ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌’అయిన ‘లింక్డ్‌ఇన్‌’ తాజా అధ్యయనం ‘భారత ఉద్యోగస్తుల నివేదిక’లో ఈ వివరాలు వెల్లడించింది. కొత్తగా ఏఏ రంగాల్లో ఉద్యోగాలు అధికంగా వస్తున్నాయి.. ఎటువంటి నిపుణులకు గిరాకీ ఉంది.. దేశంలోని ఏఏ నగరాలు సమర్థులైన ఉద్యోగులను ఆకర్షించగలుగుతున్నాయి... అనే విశేషాలతోఈ నివేదికను లింక్డ్‌ఇన్‌ రూపొందించింది.

యువ ఉద్యోగులు భారత్‌లోనే అధికం..
ప్రపంచవ్యాప్తంగా యువ జనాభా, యువ ఉద్యోగులు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం భారతేనని ఈ నివేదిక పేర్కొంది. ఉద్యోగాలు, ఉద్యోగస్తుల తీరుతెన్నులను ప్రతిబింబిస్తూ ఈ నివేదిక రూపొందించినట్లు లింక్డ్‌ఇన్‌ ఇండియా పేర్కొంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరింగ్, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ రంగాలకు 2020 తొలి త్రైమాసికంలో విశేష గిరాకీ కనిపించినట్లు తెలిపారు. నైపుణ్యం కలిగిన నిపుణులను ఆకర్షించటంలో ముందున్న నగరాలు ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ తొలిమూడు స్థానాల్లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో ముంబై, చెన్నై, కోల్‌కతా, అహ్మదాబాద్‌ చండీగఢ్, వడోదర, జయపుర ఉన్నాయి.

ఈ రంగాల్లోనే అత్యధిక కొలువులు.. 
1.సాఫ్ట్‌వేర్, ఐటీ సేవలు
2.తయారీ రంగం, ఫైనాన్స్, కార్పొరేట్‌ సేవలు 
3.విద్యా రంగం

యువతలో డాలర్‌ డ్రీమ్స్‌..
దేశంలో పలు మెట్రో నగరాల్లో విస్తృత ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నప్పటికీ యువతలో డాలర్‌ డ్రీమ్స్‌ కనుమరుగు కాలేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. కాస్తోకూస్తో చదువుకొని విదేశాలకు వెళ్లి మంచి ఉద్యోగంలో స్ధిరపడాలని కోరుకునే యువకుల సంఖ్య ఇటీవల కాలంలో పలు నగరాల్లో పెరిగిపోతోందని ఈ నివేదిక వెల్లడించింది. యువత ప్రధానంగా ఏ దేశాలకు వెళుతున్నారనేది పరిశీలించగా.. మొదట అమెరికా ఉండగా, ఆ తర్వాత స్థానాల్లో యూఏఈ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలున్నాయి. 

ఈ రంగాల్లో నైపుణ్యాలకు భలే గిరాకీ..
1. ఉత్పత్తి, నిర్మాణ రంగం, విద్యుత్, మైనింగ్‌ రంగాల్లో ఆటో క్యాడ్‌ నిపుణులకు గిరాకీ ఉంది
2. మేనేజ్‌మెంట్‌ ఉద్యోగార్థుల్లో నాయకత్వ లక్షణాలు, కస్టమర్‌ సర్వీస్, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ సామర్థ్యాలు ప్రదర్శించే వారికి పెద్దగా వెతుక్కునే పనిలేకుండానే ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంది.
3. ముంబై, ఢిల్లీ నగరాల్లో మేనేజ్‌మెంట్‌ రంగంలో అధికంగా ఉద్యోగాలున్నాయి. ఐటీ ఉద్యోగాలకు బెంగళూరు సిటీ కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిందని తాజా నివేదిక వెల్లడించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement