ముందు చూపేదీ?
కొత్తగూడెం(ఖమ్మం) : రాష్ట్రం తీవ్రమైన విద్యుత్ సమస్యను ఎదుర్కొంటోంది. ఈ సమస్యను అధిగమించేందుకు రానున్న మూడేళ్ల కాలంలో 10 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అయితే కొత్త విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలంటే ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు బొగ్గు. రాష్ట్రానికే తలమానికంగా ఉన్న సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తిలో ముందంజలో ఉన్నప్పటికీ కొత్త విద్యుత్ ప్రాజెక్టులు వస్తే వాటి అవసరాలకు తగిన విధంగా బొగ్గు ఉత్పత్తి చేయగలిగే పరిస్థితులు ప్రస్తుతం కనిపించడంలేదు.
దీంతో కొత్త ప్రాజెక్టులకు బొగ్గు ఎక్కడి నుంచి వస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుతం తెలంగాణ జెన్‌కో ఆధ్వర్యంలో పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్) ద్వారా 1720 మెగావాట్లు, భూపాలపల్లిలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు ద్వారా 500 మెగావాట్లు, ఆర్‌టీపీపీ ద్వారా మరో 60 మెగావాట్లు ఉత్పత్తి జరుగుతోంది. ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా ఇప్పటివరకు 2,280 మెగావాట్లు మాత్రమే రాష్ట్రానికి అందుతోంది. వీటికి సింగరేణి సంస్థ నుంచి ప్రతిరోజు 35 వేల టన్నుల బొగ్గు సరఫరా అవుతోంది.
అవొస్తే.. బొగ్గు సంగతేంటి?
రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పే విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా సుమారు 10 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కొత్తగూడెం మండలంలోని పునుకుడుచెలకలో రెం డువేల మెగావాట్లు, మణుగూరులో మరో రెం డువేల మెగావాట్లతోపాటు ఇప్పటికే పాల్వంచలోని కేటీపీఎస్‌లో 7వ దశ నిర్మాణం ద్వారా మరో 800 మెగావాట్ల ఉత్పత్తి చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. వీటితోపాటు మరి కొన్ని ప్రాజెక్టులను నెలకొల్పి మొత్తం 10 వేల మెగావాట్ల సామర్థ్యంగల విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలంటే ఆయా ప్రాజెక్టులకు రోజుకు సుమారు 1.5 లక్షల టన్నుల బొగ్గు అవసరం పడుతుంది.
సింగరేణి సంస్థ ప్రస్తుతం తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో విస్తరించి ఉన్న 34 భూగర్భ గనులు, 15 ఓపెన్‌కాస్టు ప్రాజెక్టుల ద్వారా రోజుకు రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. వీటిలో కేవలం 35 వేల టన్నులు మాత్రమే తెలంగాణ జెన్‌కోకు సరఫరా చేస్తుండగా మిగిలిన బొగ్గును ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్ ప్రాజెక్టులతోపాటు ఎన్‌టీపీసీ, ఇతర సిమెంటు సంస్థలకు సరఫరా చేస్తోంది. సింగరేణి సంస్థ కొత్తగా బొగ్గుగనులను ఏర్పాటు చేసి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటే తప్ప నూతనంగా ఏర్పాటు చేయదల్చుకున్న విద్యుత్ ప్రాజెక్టులకు బొగ్గును సరఫరా చేసే పరిస్థితులు కన్పించడంలేదు.
పెండింగ్‌లో 21 బొగ్గు గనుల ప్రాజెక్టులు
సింగరేణి సంస్థ వ్యాపారాభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అదేవిధంగా సంస్థ ఆధ్వర్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు ఇప్పించి ప్రారంభిస్తే తప్ప తెలంగాణలో కొత్తగా ఏర్పాటుచేసే విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన మేరకు బొగ్గు సరఫరా జరిగే అవకాశం లేదు. ఇప్పటికే సంస్థ ఆధ్వర్యంలో 2006 నుంచి ఇప్పటివరకు 21 ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ కారణాలతో ప్రాజెక్టులు పెండింగ్ పడుతూ వస్తుండడంతో సంస్థ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోలేకపోతోంది.
వీటికి భూసేకరణ ప్రధాన సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి కొత్త విద్యుత్ ప్రాజెక్టులతోపాటు కొత్తగా బొగ్గుగనులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిపక్షంలో విదేశాలనుంచి బొగ్గును దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇదే జరిగితే విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరగడంతోపాటు ప్రజలపై భారం పడుతుందని పలువురు భావిస్తున్నారు.