
హైదరాబాద్: అనారోగ్యం, మానసిక ఒత్తిడి భరించలేక సీఆర్పీఎఫ్ మాజీ ఉద్యోగి తన లైసెన్స్‌డ్ గన్‌తో కాల్చు కుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్‌లో గురువారం చోటుచేసుకుంది. రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన మాదగోని రాములు(60), చంద్రకళ దంపతులు. వీరు 15 ఏళ్ల క్రితం జవహర్‌నగర్‌లోని ప్రగతినగర్‌లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. రాములు సీఆర్పీఎఫ్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించి 6 ఏళ్ల క్రితం పదవీ విరమణ పొందాడు.
వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు ఆర్మీలో జవానుగా విధులు నిర్వహిస్తుండగా చిన్న కుమారుడు, కుమార్తె ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చంద్రకళ సహాయకురాలిగా పనిచేస్తున్నారు. గురువారం ఉదయం చంద్రకళ తన మనవడికి జ్వరం రావడంతో చూసి వద్దామని అదే కాలనీ సమీపంలో ఉన్న పెద్ద కుమారుడి ఇంటికి వెళ్లింది. కొన్ని రోజులుగా అనారోగ్యంగా ఉండటంతో రాములు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.
ఇంట్లో ఎవరులేని సమయంలో తన లైసెన్స్ తుపాకీతో తలపై కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటి పక్కన ఉన్న వారికి శబ్ధం రావడంతో వచ్చి చూసేసరికి రాములు రక్తపుమడుగులో పడి ఉన్నాడు. ఘటనా స్ధలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో పరిసర ప్రాంతాలను గాలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.