గడ్డుకాలమే!
- కరెంటు కోతలతో ఎండుతున్న పంటలు
- పగులుతున్న రెతన్నల గుండెలు
- పరిశ్రమలకు పవర్ హాలీడే ఇచ్చినా... సాగుపై శీతకన్నే
సాక్షి ప్రతినిధి,సంగారెడ్డి: జిల్లాలో కరెంటు సంక్షోభం కమ్ముకోస్తోంది. మునుపెన్నడూ లేనంతగా రోజుకు 5 మిలియన్ యూనిట్ల కరెంటు లోటు ఏర్పడింది. పరిశ్రమలకు వారానికి రెండు రోజుల పాటు పవర్ హాలీడే ప్రకటించి, గృహ విద్యుత్‌కు కోత పెట్టినా ... రోజుకు ఇంకా 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ అత్యవసరమవుతోంది. చేను పొట్టకొచ్చి గింజలు పాలుపోసుకునే సమయంలో కరెంటు కోతలు పెరిగిపోవడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత అంచనాల ప్రకారం జిల్లాకు రోజుకు 22.80 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంది. కానీ ఇప్పటికీ 2001 లెక్కల ఆధారంగానే రోజుకు 17.51 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ట్రాన్స్‌కో అధికారులు కేటాయించారు. ఇందు లో 6.50 మిలియన్ యూనిట్లువ్యవసాయానికి, 9.40 మిలియన్ యూనిట్లు పరిశ్రమలకు, మిగిలినది గృహ అవసరాల కోసం విని యోగిస్తున్నట్లు ట్రాన్స్‌కో రికార్డులు చెప్తున్నాయి. డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వట్టిపోతున్న పొట్టకొచ్చిన చేను
జిల్లాలో 2.25 లక్షల ఉచిత విద్యుత్తు మోటారు కనెక్షన్లు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 5.58 లక్షల ఎకరాలు సాగు అవుతున్నాయి. ఇందులో 61.62 వేల హెక్టార్లలో వరి, 26 వేల హెక్టార్లలో చెరకు పం టలు సాగవుతున్నాయి. ఈ రెండు పంటలకు 24 గంటలు తడి అవసరం. మిగిలిన భూమిలో మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ పంటలు వేశారు. 35 రోజుల నుంచి చినుకు కూడా రాలకపోవడంతో రైతులు విద్యుత్ మోటార్ల మీదనే ఆధారపడి కాలాన్ని నెట్టుకొచ్చారు. ప్రస్తుతం వరి చేసు పొట్టకురాగా, గింజ ఇప్పుడిప్పుడే పాలుబోసుకుంటున్నాయి.
ఈ పంటలకు సరిగ్గా నీళ్లు పారాలంటూ రోజుకు కనీసం 10 గంటల పాటు నిరంతరాయ కరెంటు అవసరం. సరిగ్గా పంటకు నీళ్లు అవసరమైన సమయంలో కరెంటు కోతలు పెరగటం తో రైతుల గుండెలు పగులుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 6 గంటల నిరంతరాయ కరెంటు అందిస్తామని ప్రకటించినప్పటికీ, వాస్తవంగా రైతులకు 4 గంటలకు మించి కరెంటు అందడం లేదు. టాన్స్‌కో అధికారుల అంచనాల ప్రకారం వ్యవసాయానికి ప్రస్తుతం కనీసం 7.50 మిలియన్ యూ నిట్లకు పైగా విద్యుత్ అవసరం, కానీ 4 మిలియన్ యూని ట్లకు మించి కరెంటును ఇవ్వలేకపోతున్నారు.
ఇక్కడో తిరకాసు
రాష్ట్రం విడిపోవటం, విద్యుత్ డిస్కం పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య సయోధ్య లేకపోవడానికి తోడు, వర్షాలు కూడా కురవక పోవడంతో రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ కొరత ఏర్పడింది. దీంతో జిల్లాకు రావాల్సిన రోజు వారీ వాటాలో 5 మిలియన్ యూనిట్లు కోత పెట్టారు. పరిశ్రమలకు పవర్ హాలీడే, గృహ వినియోగానికి కోత పెట్టడంతో 3 మిలియన్ యూనిట్ల కరెంటు కవర్ అవుతోంది. అయినా ఇంకా 2 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉంటుంది. ఈ లోటు పూడ్చటానికి అధికారులు వ్యవసాయానికి కోత పెడుతున్నారు. దీని కూడా ఓ కారణం ఉంది.
వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్, వ్యవసాయానికి నెలకు 180 లక్షల మిలియన్ల విద్యుత్తు వినియోగిస్తున్నారు. ప్రతి విద్యుత్ మోటారు కనెక్షన్‌కు రూ.20 మాత్రమే సర్వీస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తం రూ.20 కోట్లకు మించి రావటంలేదు. అదే పరిశ్రమలకైతే... జిల్లాలో 9 వేల భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటికి రోజుకు 9.40 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. పరిశ్రమలకు ఇస్తున్న ప్రతి యూనిట్ విద్యుత్‌కు రూ. 6 చార్జీ వేస్తారు. ఈ లెక్కన పరిశ్రమల నుంచి నెలకు రూ.150 నుంచి రూ.200 కోట్ల ఆదాయం వస్తోంది. దీంతో విద్యుత్ అధికారులు వ్యవసాయానికి ఇచ్చేది ఉచిత విద్యుత్తే కాబట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటు మీద కోత పెట్టి అన్నదాతల ఉసురు తీస్తున్నారు.