సురేష్
సాక్షి, సిటీబ్యూరో: జాతీయ, అంతర్జాతీయ చానళ్లకు పరిమితమైన ప్రాంక్ వీడియోల విష సంస్కృతి యూట్యూబ్ చానళ్ల పుణ్యమా అని నగరానికీ పాకింది. ప్రాంక్ పేరుతో కొందరు హద్దు మీరి వ్యవహరిస్తున్నారు. ఆడవాళ్లను వేధింపులకు గురిచేస్తున్నారు. ‘నేను సింగిల్ అండి... నాకు ఓ హగ్ ఇస్తారా? అంటూ ప్రాంక్ పేరిట వీడియో రూపొందించిన ‘డ్రీమ్ బాయ్ జయసూర్య’ అనే యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు రమావత్ సురేష్..తన చానల్‌లో వీడియోను పోస్టు చేశాడు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇద్దరు యువతులు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులుదర్యాప్తు చేపట్టారు. ఈ తరహా కేసు నమోదు కావడం నగరంలో ఇదే తొలిసారి. సురేష్ గత కొన్నాళ్లుగా డ్రీమ్ బాయ్ జయసూర్య పేరుతో ఓ చానల్ నిర్వహిస్తున్నాడు. ఇప్పటికే దీని కేంద్రంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు సంబంధించిన లింకులు ఏర్పాటు చేయడం, బెట్టింగ్స్‌కు అవసనరమైన లింకులు పొందుపరచడం, వీటిని వినియోగించుకోవడానికి నిర్ణీత మొత్తం సబ్‌స్క్రిప్షన్ కట్టించుకోవడం వంటివి చేస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాడు.
దీనికితోడు తన చానల్ పాపులారిటీ పెంచుకోవడానికి ప్రాంక్ వీడియోలు చేయడం మొదలెట్టాడు. కొన్నాళ్ల క్రితం ఒంటిపై షార్ట్..పైన టవల్ కట్టుకుని ఓ పబ్లిక్ ప్లేసులో సంచరిస్తూ యువతుల్ని వేధించాడు. సినిమా చూస్తారా? అంటూ వారిని ప్రశ్నిస్తూ హఠాత్తుగా తన టవల్ తీసేసి భయభ్రాంతులకు గురి చేశాడు. ఇలా రూపొందించిన ప్రాంక్ వీడియోను గత ఏడాది ద్వితీయార్థంలో తన యూట్యూబ్ చానల్‌లో పెట్టాడు. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అయినప్పటికీ సైబర్ స్పేస్ పోలీసింగ్ ద్వారా ఈ విషయం గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఏడాది జనవరిలో రమావత్ సురేష్‌ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపారు. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఇతడు రూపొందించిన వీడియో ఇప్పడు కేసు నమోదుకు కారణమైంది.
నగరంలోని అనేక ప్రాంతాల్లో సంచరించిన ఇతగాడు నేను సింగిల్ అండి... ఓ హగ్ ఇస్తారా? అంటూ యువతులు, విద్యార్థినుల్ని అడుగుతూ వీడియో రికార్డు చేశాడు. దాదాపు పది నిమిషాల నిడివితో ఉన్న దీన్ని తన యూట్యూబ్ చానల్ డ్రీమ్‌బాయ్ జయసూర్యలో పొందుపరిచాడు. ప్రతి సీన్‌ను వెనుక బ్యాక్ గ్రౌండ్ సాంగ్స్, మ్యూజిక్ ఏర్పాటు చేశాడు. దీన్ని ఇప్పటి వరకు 12 లక్షల మంది వీక్షించారు. ప్రతి సీన్ ముగిసిన తర్వాత ఇది ప్రాంక్ వీడియో అంటూ వారికి చెబుతూ..అదిగో అక్కడ కెమెరా ఉంది, హాయ్ చెప్పండి అంటూ సూచించాడు. అయితే ఇద్దరు యువతుల విషయంలో మాత్రం వారికి ఇలా చెప్పలేదు. యూ ట్యూబ్ చానల్‌లో ఉన్న ఆ వీడియో ఇటీవల ఈ ఇద్దరు యువతుల దృష్టికి వచ్చింది. తమ అనుమతి లేకుండా రూపొందించిన వీడియోను చానల్‌లో పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నగర సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment