
జీహెచ్‌ఎంసీ కమిషనర్ దాన కిషోర్
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల నేపథ్యంలో 23 వేల మంది పోలింగ్ సిబ్బంది అవసరమని హైదరాబాద్ ఎన్నికల కమిషనర్ దాన కిషోర్ అన్నారు. సోమవారం జీహెచ్‌ఎంసీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో మూడేళ్లుగా పని చేస్తున్న అధికారులను బదిలీ చేశామన్నారు. మొత్తం 3826 మంది బూత్ లెవల్ ఆఫీసర్లు పని చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేటు స్థలాలపై అనుమతి లేకుండా.. ఎన్నికల రాతలు, పోస్టర్లు అంటించరాదని ఆయన హెచ్చరించారు. అలాగే ఎన్నికల్లో పోటీ చేసే వారికి నేర చరిత్ర ఉండరాదని స్పష్టం చేశారు.
ఎన్నికల నిర్వహణ కోసం ఓటర్ల లిస్టు ప్రకటించామన్న కిషోర్.. హైదరాబాద్ ఓటర్లలో యాభై వేల మందిని తొలగించగా లక్షా యాభై వేల మంది అదనంగా చేరినట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో మొత్తం 39,60,600 ఓటర్లు ఉన్నారని పేర్కొన్నారు. ఓటులేని వాళ్లు ఇప్పటికీ నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదే విధంగా ఓటింగ్‌పై అవగాహన పోటీలు, కొటేషన్లు 7993153333 నంబరుకు పంపి బహుమతి గెలుచుకోవచ్చని కిషోర్ తెలిపారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని పేర్కొన్నారు.