కేసముద్రంలో పట్టపగలు చోరీ
69 గ్రాముల బంగారం,
రూ.10 వేల నగదు అపహరణ
కేసముద్రం : గుర్తు తెలియని వ్యక్తి పట్టపగలు ఒకరి ఇంట్లో చొరబడి 69 గ్రాముల బంగారు ఆభరణాలతోపాటు రూ.10 వేలు, వెండి వస్తువులను ఎత్తుకెళ్లిన సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మం డల కేంద్రంలోని జెడ్పీ పాఠశాల ఎదుట పసిక నాగిరెడ్డి అనే వ్యక్తి తన ఇంటిలో కొద్ది రోజులుగా క్లినిక్ నడుపుతున్నాడు.
అయితే మధ్యాహ్నం వరకు రోగులను పరీక్షించిన తర్వాత అతడు భార్యతో కలిసి ఇంటి వెనకున్న చెట్లకు నీళ్లు పెడుతున్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి నాగిరెడ్డి ఇంట్లో చొరబడి గదిలోని బీరువా తలుపును తెరిచి 69 గ్రాముల బంగారు ఉంగరాలు, గొలుసులు, వెండివస్తువులు, రూ.10 వేల నగదు ఎత్తుకుని వెళ్లాడు. అప్పటికే మనుషుల అలికిడి విన్న దంపతులు ఇంటిలోకి ఎవరో వచ్చారని పిలుస్తూ వస్తుండగా సదరు వ్యక్తి పరారయ్యాడు. కాగా, బీరువాకు ఉన్న తాళం సాయంతో ఇంట్లోని వస్తువులు ఎత్తుకెళ్లారని గుర్తించి దంపతులు బోరున విలపిం చారు. విషయం తెలుసుకున్న ఎస్సై ఫణిధర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. అనంతరం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.