
రెండువారాల్లో డీసీసీలకు అధ్యక్షులు!
అసెంబ్లీ సమావేశాల తర్వాత జిల్లాల్లో అభిప్రాయ సేకరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జిల్లాలకు పార్టీ కొత్త సారథుల ఎంపిక ప్రక్రియను రెండు వారాల్లోగా పూర్తిచేయాలని పీసీసీ భావిస్తోంది. దీనికనుగుణంగా ఇప్పటికే స్థూలంగా అభిప్రాయ సేకరణను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్యనేతలు పూర్తి చేశారు. అసెంబ్లీ సమావేశాల తర్వాత మరో సారి జిల్లాల వారీగా అభిప్రాయ సేకరణను పూర్తిచేయనున్నారు. పాత జిల్లాలకు కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేసినవారు ఆసక్తి చూపిస్తే ముందు వారికే అవకాశం ఇవ్వాలని పీసీసీ నిర్ణయించింది. కాగా, రంగారెడ్డి డీసీసీ పదవి కి క్యామ మల్లేశ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షు నిగా ఉన్న దానం నాగేందర్ జిల్లాల పునర్వి భజనకు ముందుగానే తమ పదవులకు రాజీనామా చేశారు. మొత్తం 31 జిల్లాలు ఏర్పా టైన నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుల ఎంపికపై టీపీసీసీ కొంతకాలంగా కసరత్తు చేస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పాటైన తర్వాత పార్టీ కార్యక్ర మాల విషయంలోనూ కొంత అయోమయం ఏర్పడింది.
పాత జిల్లాల పరిధిలో ఉన్న కొన్ని మండలాలు, గ్రామాలు మరో జిల్లా పరిధి లోకి కూడా చేరాయి. మారిన మండలాల్లో పార్టీ కార్యక్రమాలను ఎవరిద్వారా పర్యవేక్షిం చాలో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా డీసీసీలకు అధ్యక్షుడి ఎంపిక పూర్తిచేయాలని పార్టీ భావిస్తోంది. సామాజిక సమీకరణాలు, సమర్థత, పార్టీకి కేటాయించే సమయం, ఆ జిల్లాలోని పార్టీ ముఖ్యనేతలకు ఆమోదయోగ్యం వంటి వాటి పై అభిప్రాయ సేకరణ జరుపుతోంది. రెండు వారాల్లోగా కసరత్తు పూర్తిచేసి, అధిష్టానవర్గం నుంచి ఆమోదం పొందాలని యోచిస్తోంది.
పలువురి అనాసక్తి: పార్టీకోసం పూర్తి కాలం పనిచేయగలిగే నాయకులనే డీసీసీ అధ్యక్షులు గా పరిశీలించాలన్నది ఏఐసీసీ మార్గదర్శనం. పార్టీ అధికారంలోకి వస్తే డీసీసీ అధ్యక్షు లుగా పనిచేసిన వారికి నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని భావిస్తోంది. అయితే డీసీసీ అధ్యక్షులకు పార్టీ టికెట్లు లేవనడంతో ప్రజాక్షేత్రంలో పోటీచేయాలనుకున్న నేతలు డీసీసీ అధ్యక్షుడిగా చేయడానికి నిరాసక్తత చూపుతున్నారు.