బంపర్‌ ఆఫర్లతో స్వాగతం.. బండి కొనండి | Dealers Ready With Offers on Two Wheelers Sales | Sakshi
Sakshi News home page

బండి..కొనండి

Dec 17 2019 10:51 AM | Updated on Dec 17 2019 2:46 PM

Dealers Ready With Offers on Two Wheelers Sales - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : వాహన అమ్మకాలు మరింతగా పెంచుకునేందుకు ఆటోమొబైల్‌ డీలర్లు రకరకాల ఆఫర్లు, డిస్కౌంట్లతో సిద్ధమయ్యారు. ఇయర్‌ఎండర్‌ను తమకు అనువుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వినియోగదారుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేదు. గత ఏడాది కంటే ఈ ఏడాది అమ్మకాలు ఎక్కువగానే జరిగినా, అనుకున్న టార్గెట్‌ రీచ్‌ కాలేదు. ఈ ఏడాది ముగింపునకు మరో 14 రోజులే  మిగిలిఉంది. వీలైనన్ని ఎక్కువ వాహనాలను విక్రయించేందుకు డీలర్లు ఇస్తున్న ఆఫర్లు ఆకట్టుకోలేకపోతున్నాయి. ద్విచక్ర వాహనాలపై రూ. 5 వేలు, లగ్జరీ కార్లు, మధ్యతరగతి వేతన జీవులు కొనుగోలు చేసే వివిధ రకాల వాహనాలపైన రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు తగ్గించి విక్రయిస్తున్నారు. కొన్ని సంస్థలు రెండేళ్ల బీమా మొత్తాన్ని చెల్లిస్తున్నాయి. అయినా కొనుగోలుదారుల నుంచి స్పందన అంతంతమాత్రంగానే ఉంది. కొత్త ఏడాదిలో కొత్త బండి కొనుగోలు చేయాలనే సెంటిమెంట్‌తో రెండుమూడు నెలలుగా వాహన కొనుగోళ్లు భారీగా తగ్గాయి. వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రభుత్వం భారత్‌ స్టేజ్‌–6 ప్రమాణాలు కలిగిన వాహనాలను  ప్రవేశపెడుతోంది. వాహనం ఇంజిన్‌ సామర్థాన్ని పెంచడంతో పాటు ఇంధనాన్ని పూర్తిస్థాయిలో మండించి కాలుష్య కారకాలను బాగా తగ్గించే బీఎస్‌–6 వాహనాలు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేయగలవని భావిస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఈ నిబంధన వర్తిస్తుంది. కానీ ఆటోమొబైల్‌ సంస్థలు జనవరి నుంచే వీటిని విక్రయానికి సిద్ధం చేస్తున్నాయి. 

ఈ ఏడాది 2.29 లక్షల వాహనాల విక్రయాలు అదనం  
సాధారణంగా రవాణారంగానికి చెందిన వాహనాల కంటే వ్యక్తిగత వాహనాలే పెద్దఎత్తున అమ్ముడవుతాయి. రూ.కోట్ల విలువైన లగ్జరీ కార్లు, రూ.లక్షల ఖరీదైన లగ్జరీ బైక్‌లు మొదలుకొని మధ్యతరగతి బడ్జెట్‌లో లభించే వివిధ రకాల కార్లు, దిచక్ర వాహనాల అమ్మకాలే టాప్‌గేర్‌లో ఉంటాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయాల్లో  ప్రతిరోజు 1500 నుంచి 2000 వరకు వివిధ రకాల వాహనాలు నమోదైతే,  వాటిలో 85 శాతం వరకు వ్యక్తిగత వాహనాలే ఉంటాయి. ఈ క్రమంలో నగరంలోని ఆటోమొబైల్‌ రంగం కూడా రవాణావాహనాల కంటే  వ్యక్తిగత వాహన విక్రయాలపైనే ఆధారపడి ఉంది. కానీ ఈ ఏడాది ఆర్థిక సంక్షోభం వాహనరంగంపై పెను ప్రభావాన్ని  చూపింది. తయారీ సంస్థలు సైతం వాహనాల తయారీని నిలిపివేశాయి. నగరంలోని మధ్యతరగతినికూడా మాంద్యం ప్రభావితం చేసింది. ‘కేంద్రం ప్రకటించిన కొన్ని సడలింపుల నేపథ్యంలో అమ్మకాలు ఊపందుకుంటాయని భావించినప్పటికీ  గత సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు అంతంత మాత్రంగానే ఉంది’ అని ఆటోమొబైల్‌ డీలర్‌ ఒకరు విస్మయం వ్యక్తం చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌నాటికి  గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 53,22,694 వాహన అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది ఇప్పటి వరకు 55,52,416 వాహనాలు అమ్ముడుపోయాయి. గతేడాదితో పోలిస్తే 2,29,722 వాహనాలు ఎక్కువే అయినా, ఆర్థిక రంగం బాగుంటే మూడు లక్షల సంఖ్యను దాటేది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement