కాంగ్రెస్ పార్టీలో సార్వత్రిక ఓటమి మంటలు రాజుకుంటున్నాయి. అపజయానికి నువ్వంటే.. నువ్వే! కారణమంటూ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో గుమ్మనంగా వ్యవహరించిన నేతలు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతూ అధిష్టానవర్గం వద్దకు ‘క్యూ’ కడుతున్నారు. వ్యతిరేకులపై ఫిర్యాదులపర్వం మొదలైంది. ఈ నేపథ్యంలో జిల్లాకు చెందిన ఓ ముఖ్యనేత సోదరుడిపై వేటుపడింది. మరో పదిమందిపై క్రమశిక్షణ చర్యలకు టీపీసీసీ సిద్ధమైంది. దీంతో హస్తం పార్టీలో పెద్ద రచ్చే జరగనుంది.
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లాలో మునిసిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు మొదలుకుని సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన నేతలపై రగిలిపోతున్న పలువురు అభ్యర్థులు ఫలితాలు వెలువడగానే ఫిర్యాదుల పర్వానికి తెరతీశారు. ఎన్నికల సమయంలో గుట్టుగా టీపీసీసీకి ఫిర్యాదులు అందించిన అభ్యర్థులు చర్యలు తీసుకోవాలని ఇటీవల గట్టిగా పట్టుబడుతున్నారు. సాధారణ ఎన్నికల్లో టికెట్ల కోసం ప్రయత్నించి భంగపడిన నేతలు ప్రచారం, పోలింగ్ పర్వంలో తమ ప్రతాపాన్ని పరోక్షంగా చూపారు.
మరికొందరు నామ్‌కే వస్తేగానే పార్టీలో కొనసాగినా.. అధికార అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇదిలాఉండగా, కేంద్ర మాజీమంత్రి ఎస్. జైపాల్‌రెడ్డి జిల్లా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరువాతే కాంగ్రెస్‌లో విభేదాలు తీవ్రంగా పోడచూపాయనే ఆరోపణలు ఉన్నాయి. మాజీమంత్రి డీకే అరుణ కూడా తమ వర్గీయులకు పట్టుబట్టి టికెట్లు ఇప్పించుకోవడం ఈ విభేదాలకు మరింత ఆజ్యం పోసినట్లయిందని భావిస్తున్నారు. కొడంగల్, మక్తల్, షాద్‌నగర్, జడ్చర్లలో టికెట్లు దక్కని కొందరు కాంగ్రెస్ ముఖ్యనేతలు పార్టీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.
వ్యతిరేకులపై వేటు
కల్వకుర్తి నుంచి టికెట్ ఆశించి భంగపడిన కసిరెడ్డి నారాయణరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచి ఓటమిపాలైనస్పటికీ 24 వేలకు పైగానే ఓట్లను తెచ్చుకోగలిగారు. ఈ కారణంతోనే అధికార అభ్యర్థి చల్లా వంశీచంద్‌రెడ్డి స్వల్పమెజార్టీతో గెలుపొందారనే వాదన వినిపిస్తోంది. ఈ నియోజకవర్గంలో మాజీమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సోదరుడు రాంరెడ్డి పార్టీ ప్రకటించిన అభ్యర్థికి వ్యతిరేకంగా.. కసిరెడ్డి నారాయణరెడ్డికి అనుకూలంగా ఎన్నికల్లో పనిచేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
కొల్లాపూర్‌లో కూడా పార్టీ టికెట్ దక్కించుకున్న బీరం హర్షవర్ధన్‌రెడ్డికి వ్యతిరేకంగా విష్ణువర్ధన్‌రెడ్డి పనిచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. కల్వకుర్తి అభ్యర్థి వంశీచందర్‌రెడ్డి అయితే యువనేత రాహుల్‌గాంధీ వద్దనే మాజీ మంత్రి జైపాల్‌రెడ్డిై వర్గీయులు సహకరించడం లేదని ఫిర్యాదుచేశారు. మరోవైపు తమకు సహకరించని మాజీమంత్రి డీకే.అరుణ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని ఎస్.జైపాల్‌రెడ్డి వర్గీయులు టీపీసీసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని 10 మంది నాయకులకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఈ మేరకు రాంరెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన ట్లు ప్రకటించింది.
అదేవిధంగా మరికొందరు నాయకులపై కూడా చర్యలు తీసుకునేందుకు టీపీసీసీ క్రమశిక్షణ సంఘం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఒక వర్గం నాయకులపైనే చర్యలు చేప ట్టి మరోవర్గం వారిని చూసీచూడనట్లు శిక్షణ సంఘం వ్యవహరిస్తునందన్న ఆరోపణలతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో జిల్లా కాంగ్రెస్‌లో మళ్లీ రచ్చ మొదలైందనే చర్చ ఆ పార్టీ వర్గాల నుంచే వ్యక్తమవుతోంది.
ఓటమి మంటలు !
Published Wed, May 21 2014 3:05 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement