అమ్మా, నాన్నా.. నన్ను క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.
రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య
తాండూరు రూరల్: అమ్మానాన్న.. క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్ మండలం హస్నాబాద్‌కు చెందిన మిర్జాపురం రాములు, రాములమ్మ దంపతుల కుమారుడు రాఘవేందర్(20) తాండూరులోని సింధూ డిగ్రీ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. చదువుకుంటూనే హైదరాబాద్‌లో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. కొంతకాలంగా రాఘవేందర్ స్వగ్రామంలో ఉంటున్నాడు. ఉద్యోగం మానేసి చదువుకోమని తల్లిదండ్రులు సూచించినా వినకుండా పనిచేసుకుంటూ చదువుకుంటానని చెప్పి గత ఆదివారం ఇంటి నుంచి బయలుదేరాడు.
గురువారం ఉదయం తాండూరు రైల్వేస్టేషన్ సమీపంలో రాఘవేందర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతడి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. చేతికి అందివచ్చిన కుమారుడు బలవన్మరణానికి పాల్పడడంతో రాఘవేందర్ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.