మతిస్థిమితం లేని మహిళ ప్రసవం
జనగాం క్రాస్‌రోడ్డు(సూర్యాపేటరూరల్) :మానవత్వం మరిచి హీనంగా ప్రవర్తించారు..మతిస్థిమితం కోల్పోయిన అభాగ్యురాలిని ఓ కా మాంధుడు గర్భవతిని చేశాడు.. అభం శుభం తెలి యని ఆ మహిళ పట్ల అనాగరికంగా ప్రవర్తించాడు.. ఫలితంగా ఆ దీనురాలు రోడ్డుపక్కనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సూర్యాపేట పట్టణ శివారు జనగాం క్రాస్‌రోడ్డులో ఈ ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. వివరాలు.. మండలంలోని గాంధీనగర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి అనంతుల శ్రీనువాస్‌రెడ్డి రోజు మాదిరిగానే విధులకు వెళ్తూ టిఫిన్ చేసేందుకు జనగాం క్రాస్‌రోడ్డులో హోటల్ వద్ద ఆగాడు. ఇదే సమయంలో హోటల్ పక్కనే ఓ చెట్టు కింద చిన్నపిల్లను చేతులో పట్టుకుని ఒంటరిగా కూర్చొని ఉంది.
దీంతో స్థానికుల సహకారంతో ఆమె వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయగా....ఆమె ఖమ్మం జిల్లా నెమలి గ్రామం అని చెప్పడంతో పాటు తన పేరు విజయలక్ష్మి అని, తాను తన భర్తతో గొడవ పడి ఆరు సంవత్సరాల క్రితం ఇంట్లో నుంచి బయటకు వచ్చినట్లు పేర్కొన్నట్టు సమాచారం. ఇంతకు ముందు మరొకరు సంతానం ఉన్నట్లు చెప్పింది. ఇన్ని విషయాలు చెప్పిన ఆమె పూర్తి స్థాయి వివరాలు చెప్పలేకపోతుంది. ఆమె సంవత్సర కాలంగా జనగాం క్రాస్‌రోడ్డులో గల హోటల్‌ల వద్ద భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కార్యదర్శి శ్రీనువాస్‌రెడ్డి పోలీసులకు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చాడు.
వారు వెంటనే సంఘటన స్థలానికి వచ్చి మతిస్థిమితం లేని మహిళను, ఆమె కూతురును వైద్యసేవలు అందించేందుకు 108లో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆమెకు వైద్యసేవలు అందించిన అనంతరం పూర్తి వివరాలు తెలిసేంత వరకూ ఏదైనా అనాథాశ్రమంలో ఉంచుతామని అధికారులు పేర్కొన్నారు.ఆమెను గమనించిన స్థానికులు, ప్రయాణికులు పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చారు. ఆమె కూతురును పెంచుకునేందుకు చాలా మంది ముందుకు వచ్చారు. తాను తన పిల్లను ఇవ్వనంటూ కూతురిని తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది.