వరంగల్ జిల్లాలో గిరిజన బాలికల హత్యకు కారకులైన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని వివిధ ప్రజా, మహిళ, కుల సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు గురువారం హైదర్‌గూడ ఎన్‌ఎస్‌ఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విరసం నేత వరవరరావు మాట్లాడారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కంబాలకుంట తండాకు చెందిన బానోతు భూమిక(14), ప్రియాంక(14)లది ఆత్మహత్యలా కనబడడం లేదని, అది ఆత్యాచారం జరిపి ముక్కలు ముక్కలుగా చేశారని దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్యకేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
గిరిజన బాలికల ఘటన ఓ రాకెట్ అని ఆయన ఆరోపించారు. తాము చదువుకుంటున్న నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకని నవంబర్ 24న బయలుదేరి మార్గమధ్యలోనే మాయమయ్యారని ఆయన తెలిపారు. వారిని నిర్బంధించి అత్యాచారం జరిపి, ముక్కలుగా నరికి గుట్టల్లో విసిరేయడం, వారి అవయవాలను కుక్కలు పీక్కుతినడం దుర్మార్గమైన ఘటన అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కేసులో హాస్టల్ వార్డెన్, ఎస్‌ఐ లపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ఘటనకు స్థానిక మంత్రి, ఉపముఖ్యమంత్రి, ఎమ్మెలేలు బాధ్యత వహించాలని ఆయన కోరారు. మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్, కులనిర్మూలన పోరాట సమితి ఉపాధ్యక్షులు బూరం అభినవ్, పౌరహక్కుల సంఘం నాయకులు ప్రొఫెసర్ లక్ష్మణ్, చైతన్య మహిళ సంఘం నాయకురాలు జయ, కిష్టప్ప(డిటిఎఫ్), ట్రైబల్ జేఏసీ నాయకులు ఉదయ్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.