
సాక్షి, హైదరాబాద్: రోగి గత చరిత్ర, బీమా కార్డు వివరాలు, అత్యవసర సమయంలో వైద్యపరంగా ఆ రోగికి తగిన సూచనలు ఇవ్వడంపై ప్రభుత్వం దృష్టిసారించి కార్మికుల కోసం ఒక వెబ్‌సైట్‌ను అందుబాటులో తెచ్చింది. ఈ వెబ్‌సైట్‌ను కార్మిక, హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సచివాలయంలో ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ ‘బీమా పొందిన కార్మికులకు సంబంధించిన వైద్యసేవలన్నీ ఈ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి.
ప్రమాదం జరిగిన వెంటనే రోగి బ్లడ్ గ్రూప్, ఇతర అనారోగ్య కారణాలను ఈ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. రెఫరల్ ఆస్పత్రి వివరాలు, వివిధ ఆస్పత్రులకు రెఫర్ చేసిన కేసుల వివరాలను వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు. దీంతో ఫీడ్‌బ్యాక్‌ను బట్టి తక్షణమే వైద్యసేవలు అందించడానికి సులభమవుతుంది. రాష్ట్రంలో బీమా పొందిన కార్మికులు 15 లక్షల మంది ఉన్నారు. 70 డిస్పెన్సరీలు, 4 ఆస్పత్రులు, 2 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. కార్మికుల సేవల కోసం 18002701341 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేశాం. ఈ నంబరుతో డాక్టర్ ఇన్ కాల్ హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నాం. దీనిద్వారా ఇంటి దగ్గరినుంచే ఫోన్‌కాల్‌తో వైద్యుల సలహాలు, సూచనలు పొందవచ్చు’ అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment