చేనేతకు మైక్రోసాఫ్ట్‌ చేయూత | Digital Resource Center in Pochampally | Sakshi
Sakshi News home page

చేనేతకు మైక్రోసాఫ్ట్‌ చేయూత

Published Fri, Jun 23 2017 12:31 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

చేనేతకు మైక్రోసాఫ్ట్‌ చేయూత - Sakshi

చేనేతకు మైక్రోసాఫ్ట్‌ చేయూత

పోచంపల్లిలో డిజిటల్‌ రిసోర్స్‌ సెంటర్‌
24న మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభం


సాక్షి, హైదరాబాద్‌: ప్రపంచవ్యాప్తంగా వస్త్ర ప్రేమికుల మనసు దోచుకున్న విఖ్యాత పోచంపల్లి చేనేత వస్త్రాలకు చేయూతనందించేందుకు ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ సంస్థ ముందుకొచ్చింది. పోచంపల్లిలోని టూరిజం కాంప్లెక్స్‌లో డిజిటల్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఈ నెల 24న ఐటీ మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా ఈ కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఈ కార్యక్రమంలో మైక్రోసాఫ్ట్‌ ఇండియా(ఆర్‌ అండ్‌ డీ)ప్రైవేట్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అనిల్‌భన్సాలీ కూడా పాల్గొననున్నారు. దేశంలో సంక్షోభంలో ఉన్న చేనేత రంగానికి ఆర్థికంగా బాసటగా నిలవడంతోపాటు అరుదైన సాంస్కృతిక వారసత్వ వస్త్ర సంపదను భావితరాలకు అందించేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ ప్రతినిధులు తెలిపారు.

పోచంపల్లిలో ఐసీటీ కేంద్రం..
నేతవస్త్రాలకు ప్రసిద్ధిచెందిన పోచంపల్లి చేనేత వస్త్రాలను అంతర్జాతీయ విపణిలో ఒక్క మౌస్‌క్లిక్‌తో విక్రయిం చేందుకు వీలుగా స్థానికంగా ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ) హబ్‌ను మైక్రోసాఫ్ట్‌ నెలకొల్ప నుంది. ఈ కేంద్రం ద్వారా చేనేత కార్మికులు ఆధునిక సాంకేతిక విధానాలు, మార్కెటింగ్‌ అవకాశాలను అందిపుచ్చుకుని వస్త్రాలను విశ్వవ్యాప్తంగా విక్రయించి లబ్ధి పొందే అవకాశం కల్పించనున్నారు. ఈ కృషిలో మైక్రోసాఫ్ట్‌ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం, చైతన్యభారతి అనే స్వచ్ఛంద సంస్థలు పాలుపంచుకోనున్నాయి. ఈ ఐసీటీ హబ్‌లో నేతన్నలకు సాంకేతికత వినియోగం, మార్కెటింగ్‌ అవకాశాలు, ఆన్‌లైన్‌లో వస్త్రాలను విక్రయించే విషయాల్లో మెళకువలను నేర్పించేందుకు కౌన్సెలింగ్‌ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేయనున్నారు.

24న కొత్త పొదుపు పథకం
చేనేతకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం  కొత్త పొదుపు పథకానికి శ్రీకారం చుడుతోంది. ఈ నెల 24న యాదాద్రి జిల్లా పోచంపల్లిలో ప్రారంభించనున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. చేనేతతోపాటు పవర్‌లూమ్‌ కార్మికులకూ ఈ పథకం ద్వారా ప్రయోజనాలు కలుగుతా యన్నారు. కొత్తగా తీసుకొస్తున్న ఈ పథకంపై గురువారం ఇక్కడ చేనేత, జౌళి శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గతంలో ఉన్న పొదుపు పథకాన్ని పూర్తిగా మార్చేసి నేతన్నలకు అత్యధిక ప్రయోజనాలు కల్పించే దిశగా కొత్త పథకాన్ని ప్రకటిస్తామన్నారు. కార్మికులు 8 శాతం వేతనాన్ని పొదుపు చేసుకుంటుండగా, మరో 8 శాతాన్ని మ్యాచింగ్‌ గ్రాంట్‌గా చెల్లిస్తోందని చెప్పారు.

 కొత్త పథకం అమల్లోకి వస్తే మ్యాచింగ్‌ గ్రాం ట్‌ను రెట్టింపు చేసి 16 శాతం చేస్తామని వెల్లడించారు. పవర్‌లూమ్స్‌ కార్మికులకు సైతం 8 శాతం వేతనాల పొదుపుపై 8 శాతం మ్యాచింగ్‌ గ్రాంట్‌ చెల్లిస్తామన్నారు. ఈ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ హ్యాండ్లూమ్‌ వీవర్స్‌ థ్రిఫ్ట్‌ ఫండ్‌ సేవింగ్స్‌ అండ్‌ సెక్యూరిటీ స్కీం(టీఎఫ్‌ఎస్‌)ను ఏర్పాటు చేస్తామన్నారు. చేనేత సహకార సంస్థల పరిధిలో పనిచేస్తున్న వారితో పాటు సొంతంగా పనిచేస్తున్న కార్మికులు, డైయింగ్, డిజైనింగ్, వార్పింగ్, వైండింగ్, సైజింగ్‌ వంటి అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు.

 18 ఏళ్లు నిం డిన ప్రతి నేతన్న ఈ పథకంలో చేరవచ్చని చెప్పారు. ఈ పథకం అమలుకు అవసరమైన మార్గదర్శకాలను వెంట నే విడుదల చేస్తామని తెలిపారు. ఈ పథకం నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ని ఆదేశించారు. బతుకమ్మ చీరల ధరలు, ప్రొక్యూర్‌మెం ట్‌ నిర్ధారించేందుకు కమిటీ వేస్తామని తెలిపారు. పవర్‌లూమ్‌ అప్‌ గ్రెడేషన్‌ కార్యక్రమం, వర్కర్‌ టూ ఓనర్‌ కార్యక్రమాలపై కూడా మంత్రి సమీక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement