మోదీవి మత రాజకీయాలు
► ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్
సూర్యాపేట: యూపీ ఎన్నికల్లో ప్రధాని మోదీ మత రాజకీయాలు చేస్తున్నారని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. గురువారం సూర్యాపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రధాని చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదన్నారు. ఇంతకాలం మైనార్టీలు అంటేనే గిట్టని మోదీ ఇప్పుడు మదర్సాలకు రూ. 15లక్షల కేటాయిస్తామని చెప్పడం శోచనీయమన్నారు. దేశంలోని 97 శాతం ముస్లిం పిల్లలు సాధారణ పాఠశాలల్లో చదువుతున్నారని, కేవలం 3శాతం అదీ కూడా పేద ముస్లిం పిల్లలే మదర్సాలలో చదువుతున్నారని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్, విశ్వహిందూ పరిషత్ నిర్వహించే శిశుమందిర్‌ను మదర్సాలతో పోల్చడం సరికాదన్నారు. తాను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మదర్సాల అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చానని, బోర్డు ఏర్పాటు చేశానని గుర్తు చేశారు. ప్రస్తుతం దేశంలోని విద్యార్థులకు మతపరమైన విద్య అవసరం లేదని, విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే విద్య కావాలని అందుకు ఐటీ కోర్సులు బోధించాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్‌కు ప్రాధాన్యత ఉందని, విద్యార్థుకు ఆ సబ్జెక్ట్ బోధనపై దృష్టి పెట్టాలన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ సెక్రటరీ ఆర్‌సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.