
అదృశ్యమైన మహిళ.. శవమై లభించింది
పూడ్చిపెట్టిన దుండగులు
కుక్కలు లాగటంతో వెలుగులోకి...
మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం
తిమ్మాజిపేట (జడ్చర్ల టౌన్) : ఐదు నెలల క్రితం అదృశ్యమైన ఓ మహిళ శవమై లభించింది. ఈ సంఘటన మండలంలోని ఎదిరేపల్లి శివారులో ఆదివారం చోటుచేసుకుంది. తిమ్మాజిపేట ఎస్‌ఐ గురుస్వామి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని నేరెళ్లపల్లి గ్రామ శివారులో మహిళ తలకాయ పుర్రె, చీరను కుక్కలు లాగుతున్నాయని అటుగా వెళ్లిన వ్యక్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆదివారం ఉదయం తహసీల్దార్ నర్సింగ్‌రావుతో కలసి ఘటనాస్థలానికి వెళ్లాం. మహిళనును హత్య చేసి పూడ్చి పెట్టారు. సక్రమంగా పూడ్చకపోవటంతో కుక్కలు చీర, పుర్రెను బయటకు లాగేందుకు యత్నించాయి. పూడ్చిన చోట తవ్వి చూడగా చేతి ఎముకలు, పుర్రెమాత్రమే లభించాయి. బాదేపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులను పిలిపించి అక్కడే ఉన్న బాగాలకు పోస్టుమార్టం చేయించాం.
పుర్రె, వెంట్రుకలు, లభించిన చీరను ఫోరెన్సిక్‌ల్యాబ్‌కు పంపించాం. అయితే గత ఏడాది సెప్టెంబర్‌లో ఎదిరేపల్లికి చెందిన చింతకింది భీమమ్మ కనిపించకుండా పోయిందని వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నాం. ఆ మహిళే అయ్యి ఉంటుందని భావించి భీమమ్మ పిల్లలు శ్రీకాంత్ (13), అఖిల (8)తోపాటు వారి బంధువులను పిలిపించి చీరను, పుర్రెను చూయించాం. వారు ఇంట్లోనుంచి కనిపించకుండా పోయిన సమయంలో భీమమ్మ కట్టుకున్న చీరగానే గుర్తించారు.
భీమమ్మ భర్త వెంకటయ్య ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. ఇపుడు ఆమెకూడా లేకపోవడంతో పిల్లలిద్దరు అనాథలయ్యారు. ఘటనా స్థలాన్ని జడ్చర్ల సీఐ గిరిబాబు సైతం సందర్శించి పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక అందాక పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్‌ఐ తెలిపారు. చింతకింది భీమమ్మను ఎవరో హత్యచేసి పూడ్చివేసినట్లుగా అనుమానిస్తున్నామని ఆయన తెలిపారు.